- వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, ఆరోగ్యానికి ప్రయారిటీ
- కేంద్ర బడ్జెట్‌పైనా రాష్ట్రం ఆశలు.. ఇప్పటికే పలు ప్రతిపాదనలు
- ఈ నెల 25న అసెంబ్లీలో రాష్ట్ర ఫుల్ బడ్జెట్
- అదేరోజు ఉదయం కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం
హైదరాబాద్, వెలుగు: రైతులకు దన్నుగా పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను అధికారులు రూపొందిస్తున్నారు. ఈ నెల 25న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫుల్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్ట నున్నారు. అదేరోజు ఉదయం అసెంబ్లీ హాల్ లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై, బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నది. ఇక బడ్జెట్‌లో అగ్రికల్చర్ తో పాటు ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్‌కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నది.
ఈ 4 నెలల్లో నెలవారీ ఆదాయం, ఖర్చులు, ప్రాధాన్యతలను సరిచూసుకుని, పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆర్థిక శాఖ మెరుగులు దిద్దుతున్నది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, ఇతర వ్యవసాయ పథకాలకు అన్నింటికి కలిపి ఏకంగా రూ.50 వేల కోట్ల మేర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే రుణమాఫీని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో నుంచే మొదలుపెట్టింది. పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆ పద్దును సవరించనున్నారు. దీనికి తోడు విద్యపై రాష్ట్ర సర్కార్ ఫోకస్పెట్టింది. ఈ రంగానికి మొత్తం బడ్జెట్‌లో 15 శాతం మేర నిధులు కేటాయింపులు జరిగేలా చూస్తోంది. అలాగే, ఆరో గ్యారంటీ అయిన యువ వికాసం అమల్లోకి తీసుకురానున్నారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడిన్షియల్ స్కూల్స్, మండలానికోక ఇంటర్నేషనల్ స్కూల్, సెమీ రెసిడెన్షియల్, గురుకులాలకు పక్కా భవనాలు, టీచర్ల రిక్రూట్ మెంట్, యూనివర్సిటీల బలోపేతం, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్‌లు వంటివన్నీ లిస్ట్‌లో ఉండటంతో రూ.25 వేల కోట్లు.. ఆపైనే కేటాయింపులు చూపించే అవకాశం ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ప్రయారిటీ ఇస్తున్నది. దీంతో హెల్త్‌కు కూడా పెద్ద పద్దు ఉంటుందని అంటున్నారు.
తక్కువ మొత్తంలో పూర్తయ్యే ఇరిగేషన్ ప్రాజెక్టులకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. దీంతో వాటికి కూడా ఎక్కువ మొత్తంలోనే కేటాయింపులు చేయనున్నట్టు తెలిసింది. రూ.30 వేల కోట్ల మేర కేటాయించనున్నట్టు తెలుస్తున్నది. ఆయా శాఖల పరిధిలో ఉన్న ఆరు గ్యారంటీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తగా పద్దులను రూపొందిస్తున్నది. మహిళలకు రూ.2,500 ఇచ్చే పథకానికి కూడా నిధులు కేటాయింపు ఉంటుందని చర్చ జరుగుతున్నది.
ప్రాధాన్య పథకాలకు సరిపడా నిధులు కేటాయించి.. మిగిలిన అన్ని శాఖల్లో అమలవుతున్న స్కీమ్‌లకు సమ స్థాయిలో కేటాయింపులు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఓవరాల్‌గా చూస్తే ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు చేరుతుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటాన్ అకౌంట్లో రూ.2.75 లక్షల కోట్లతో బడ్జెట్‌ను పెట్టారు.
కేంద్ర బడ్జెట్‌పై ఆశలు..
రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో వ్యవహరిస్తున్నది. అదే సమయంలో కేంద్రం 22న ప్రవేశపెట్టబోయే ఫుల్బడ్జెట్లో రాష్ట్రానికి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులను ఆశిస్తున్నది. ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి.. రాష్ట్రానికి రావాల్సిన, కావాల్సిన, మేలు చేసే అంశాలపై పలు డిమాండ్లను రెండు, మూడుసార్లు వారి ముందుంచారు.
రేవంత్ ఢిల్లీ వెళ్లి కలవడంతో ప్రధాని మోదీ కూడా సానుకూలంగానే స్పందించారు. ‘పాలమూరు–-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 60% నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ‘వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి’ కింద నిధులివ్వాలని అడుగుతున్నది. రాష్ట్రంలోని 9 పాత ఉమ్మడి జిల్లాలకు ఒక్కో జిల్లాకూ రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.450 కోట్లు రావాలని వివరిస్తున్నది. మూడేండ్లకుగానూ మొత్తం రూ.1,800 కోట్ల గ్రాంటు అడుగుతున్నది.
తెలంగాణలోని కరీంనగర్, జనగాం జిల్లాల్లోనూ లెదర్ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని, ఈ పార్కులను మంజూరు చేస్తే.. భూములు కేటాయిస్తామని చెబుతున్నది. రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించామని, ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద వీటికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నది. పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్కుకు గ్రీన్ ఫీల్డ్ హోదా ఇవ్వాలని కోరుతున్నది.
మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్–విజయవాడ వరకు నూతన పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్-–నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు తుది అనుమతులు మంజూరు చేయాలని అడుగుతున్నది. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయని ఆశిస్తున్నది. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం రూ.2,233.54 కోట్లు ఇవ్వాల్సిందిగా సిఫారసు చేసిందని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని అడుగుతున్నది.
ఐఐహెచ్‌టీ మంజూరు చేయాలని కోరుతున్నది. తెలంగాణలో యాంటీ నార్కొటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, మెట్రో రైలు రెండో దశకు నిధులివ్వాలని రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరుతున్నది.
బడ్జెట్సమావేశాలపై సీఎస్ సమావేశం
ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో శనివారం సెక్రటేరియేట్‌లో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సెషన్‌లో సమన్వయ లోపం, గ్యాప్ లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. నోట్ ఆన్ డిమాండ్ రూపొందించి బడ్జెట్‌ను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
