ప్రభుత్వ జాగాలో గుడిసెలు వేసుకున్నారని..

ప్రభుత్వ జాగాలో గుడిసెలు వేసుకున్నారని..
  • వరంగల్ జిల్లా బొల్లికుంటలో ఘటన

హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ జాగాలో గుడిసెలు వేసుకున్నారనే కారణంతో ఆఫీసర్లు తెల్లారకముందే వచ్చి తొలగించారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్​మండలం బొల్లికుంటలోని 476, 484, 506 సర్వే నెంబర్లలో దాదాపు ఏడెకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొద్దిరోజుల కింద వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 2 వేల మంది పేదలు సీపీఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ప్రభుత్వం ఇండ్లు ఇవ్వకపోవడంతో గుడిసెలు వేసుకున్నామని, పట్టాలు ఇవ్వాలని కొద్దిరోజులుగా పోరాటం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జీడబ్ల్యూఎంసీ డీఆర్​ఎఫ్​ టీం, పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు బొల్లికుంటలోని గుడిసెలన్నింటినీ తొలగించేందుకు జేసీబీలతో  వచ్చారు. వర్షం పడుతున్నా గుడిసెలు ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరించారు. ఈ టైంలో తాము ఎక్కడికి వెళ్తామని గుడిసెవాసులు ఆఫీసర్లను నిలదీశారు. దీంతో పోలీసులు  బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేయగా వాగ్వాదం జరిగింది. అక్కడున్న  సీపీఐ  వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్​ భాష్మియా, నాయకులు దండు లక్ష్మణ్, జాన్ పాల్ తో పాటు దాదాపు 600 మంది  గుడిసె వాసులను అరెస్ట్​ చేసి, మడికొండలోని పోలీస్​ ట్రైనింగ్ సెంటర్​కు తరలించారు. జనాలను ఖాళీ చేయించిన తర్వాత జేసీబీలతో గుడిసెలన్నింటినీ తొలగించారు.

మళ్లీ గుడిసెలు వేయకుండా కట్టెలన్నీ కాలబెట్టారు. అరెస్ట్ చేసిన వారందరినీ మంగళవారం సాయంత్రం రిలీజ్​ చేసి ఇండ్లకు పంపించారు. విషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు గుడిసెలు వేసుకున్న ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. పోలీసులు, అధికారుల తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సీరియస్​ అయ్యారు. ఘటనపై విచారణ జరిపించి, నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపాలని సీఎం కేసీఆర్​, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తో పాటు వరంగల్ కలెక్టర్​ డా.బి.గోపీకి లెటర్​ రాశారు.