
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ఆచూకీ దొరకలేదు. అయితే ఆ చూకీ లభించని 8 మంది కార్మికుల గురించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ 8 మంది రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాద సమయంలో కాలి బుడిదై ఉంటారని భావిస్తున్నారు. వారి ఆచూకీ లభించడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
జూన్ 30న జరిగిన ఈ ఘోర ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 44కి చేరింది. మృతులకు కంపెనీ యాజమాన్యం ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. గాయపడ్డ వారికి రూ.10 లక్షల సాయం చేస్తామని చెప్పింది. కంపెనీ కార్యకలాపాలన్నీ మూడు నెలల పాటు మూసివేసింది.
పేలుడు సంభవించిన సిగాచి పరిశ్రమను నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) బృందం సభ్యులు జులై 8న పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. కమిటీ సభ్యులు సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి గల కారణాలపై నిశితంగా అధ్యయనం చేశారు.
►ALSO READ | కేటీఆర్, కవితకే పంచాయితీ ఉంది.. : మంత్రి వివేక్ వెంకటస్వామి
ఘటన జరిగిన తీరు, ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులు ఎన్డీఎంఏ టీమ్ కు వివరించారు. ప్రమాదానికి గల కారణాలు అధ్యయనం చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్డీఎంఏ టీమ్ నివేదిక ఇవ్వనుంది. వారి వెంట కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, పరిశ్రమలు, అగ్నిమాపక, కార్మిక, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.