ఆలస్యం అవుతున్న మున్సిపోల్స్​ ?

ఆలస్యం అవుతున్న మున్సిపోల్స్​ ?
  • జనవరిలోనే పూర్తి చేయాలనుకున్న మున్సిపల్​ శాఖ
  • ఓటర్‌ లిస్టు ప్రకటన తర్వాత ప్రీపోల్‌ ప్రాసెస్‌కు మరో 14 రోజులు
  • వరుసగా న్యూ ఇయర్​, సంక్రాంతి,రిపబ్లిక్‌ డే, సమ్మక్క జాతర సందడి
  • అన్నీ అనుకున్నట్టు జరిగితేనే వచ్చే నెలలో…

హైదరాబాద్‌‌, వెలుగు :

మున్సిపల్‌‌ ఎన్నికలు జనవరిలో కచ్చితంగా నిర్వహించి తీరుతామని ఇన్నాళ్లు చెప్పిన అధికారులు ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఉండవచ్చంటున్నారు. ప్రీ పోల్‌‌ ప్రాసెస్‌‌ పూర్తి చేయడం, తర్వాత వరుసగా సంక్రాంతి, రిపబ్లిక్‌‌ డే, మేడారం జాతర ఉండటంతో ఎన్నికలు ఆలస్యం కావొచ్చని చెప్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వార్డుల డీలిమిటేషన్‌‌కు ఈనెల 3న ఎంఏయూడీ అధికారులు నోటిఫికేషన్‌‌ జారీ చేయగా, 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో వార్డుల డీలిమిటేషన్‌‌పై మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ 131 వేర్వేరు జీవోలను జారీ చేసింది. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల సరిహద్దులను సూచించే వివరాలతో కూడిన ఫైనల్‌‌ నోటిఫికేషన్‌‌ను కమిషనర్లు నోటీస్‌‌ బోర్డుల్లో డిస్‌‌ప్లే చేశారు.  ఆ వివరాలను బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌కు అందజేశారు. రాష్ట్రంలో 3,149 వార్డులను పునర్విభజన చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌‌ ఆధారంగా ఎన్నికల కమిషన్​ ఓటర్‌‌ లిస్టును ప్రకటించాల్సి ఉంది. ఆ వెంటనే వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన చేపట్టాలని మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ను ఆదేశిస్తుంది. ఇందుకు 7 రోజుల టైం ఇచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు, మున్సిపల్‌‌ చైర్మన్లు, మేయర్ల ఎన్నికకు రిజర్వేషన్లు ఇలా మరో 7 రోజులు టైం తీసుకునే అవకాశముందని చెప్తున్నారు.

శనివారం నాటికి ఎస్‌‌ఈసీ ఓటరు లిస్టును ప్రకటించే చాన్స్​ఉంది. ఇది ఆలస్యమైతే ఓటర్ల గణన, రిజర్వేషన్ల ఖరారు ఇంకా లేట్​అవుతుందని చెప్తున్నారు. క్రిస్మస్​, న్యూ ఇయర్‌‌, ఇతర సెలవులను పరిగణలోకి తీసుకోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినా జనవరి 5 నాటికి రిజర్వేషన్లు ప్రకటించే ఆస్కారముంటుందంటున్నారు. ఆ వెంటనే ఎస్‌‌ఈసీ నోటిఫికేషన్‌‌ జారీ చేస్తే అప్పటి నుంచి 15వ రోజు పోలింగ్‌‌ ఉంటుంది. జనవరి 20 నుంచి 23లోగా ఎన్నికలు ముగించాలని అనుకున్నారు. కానీ ఇందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు.

మేడారం జాతర ముగిశాకే…

పండుగ సెలవులు, రిపబ్లిక్​ డే ఇలా వరుస సెలవుల నేపథ్యంలో ఒకవేళ ఆలస్యమైతే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్‌‌ ఇచ్చేందుకు అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతర ఉండటంతో అధికారులు, పోలీసులు వారం ముందే ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. జాతర ముగిసిన రెండు, మూడు రోజులకు కానీ ఫ్రీ కారు. దీంతో ఫిబ్రవరి మూడో వారంలో పోలింగ్‌‌ ముగిసేలా ఏర్పాట్లు చేసే చాన్స్​ ఉందంటున్నారు. ఆ తర్వాత టెన్త్‌‌, ఇంటర్మీడియెట్‌‌, ఇతర పరీక్షలతో ఎన్నికల నిర్వహణకు చిక్కులు ఉండడంతో ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరిలోగా ముగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

అభ్యంతరాల లెక్కలూ సరిగ్గా లేవు

వార్డుల డీలిమిటేషన్‌‌పై ఎన్ని అభ్యంతరాలు వచ్చాయనే దానికి మున్సిపల్‌‌ శాఖ హెడ్‌‌ క్వార్టర్స్‌‌ అధికారులు ఒక్కోసారి ఒక్కో లెక్కలు చెప్తున్నారు. వచ్చిన అభ్యంతరాల్లో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని తిరస్కరించారు అనే వివరాలు కూడా అధికారుల వద్ద లేవు. ఆయా మున్సిపల్‌‌ కమిషనర్లే దరఖాస్తులపై ఏ నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని ఫిర్యాదుదారులకు తెలియజేశారని, అంతకు మించిన సమాచారం తమ వద్ద లేదని తెలిపారు. 3,149 వార్డులపై 1890 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో సగానికిపైగా అబ్జక్షన్స్‌‌ను ఆమోదిస్తూ ఆ మేరకు వార్డుల ఏర్పాటులో మార్పులు, చేర్పులు చేశామని చెప్తున్నారు. ఒక వార్డుతో మరో వార్డుకు ఓటర్ల సంఖ్యలో పది శాతం నుంచి 15 శాతం వరకు తేడా ఉందని తెలిపారు.

 Officials say municipal elections are due in February