సిటీ బస్ షెల్టర్లలో దుమ్ము, చెత్త, చెదారం

 సిటీ బస్ షెల్టర్లలో దుమ్ము, చెత్త, చెదారం

హైదరాబాద్ సిటీలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన బస్ షెల్టర్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. నిర్వహణ గాలికి వదిలేయడంతో దుమ్ము, చెత్తా చెదారంతో దారుణంగా ఉన్నాయి. దీంతో బస్ షెల్టర్లలో నిల్చోడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దుర్గంధంతో ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అధికారుల లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 2 వేల 350 బస్టాపులు ఉన్నాయి. వీటిల్లో 12 వందల 50కి మాత్రమే షెల్టర్లు ఉన్నాయి.  గ్రేటర్ పరిధిలో  ప్రతిరోజు 12 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారు. కానీ సిటీలో సరిపడా బస్ షెల్టర్లు లేకపోవడంతో జనం ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ సిటీ బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న బస్ షెల్టర్లలో మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో అధ్వాన్నంగా తయారయ్యాయి. 

పేరుకే ఏసీ బస్ షెల్టర్లు..

గ్రేటర్ ప్రయాణికుల కోసం చాలా ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ఇవి పేరుకే ఏసీ షెల్టర్లు. వీటిల్లో ఏసీలు ఏనాడూ పనిచేయడంలేదు. దీంతో ప్రయాణికులు బస్ షెల్టర్ లోపల ఉక్కపోతలో కూర్చోలేక, బస్సుల కోసం బయట నిలబడ లేక ఇబ్బంది పడుతున్నారు. బస్ షెల్టర్లలో అంతా చెత్తా చెదారం పేరుకుంటోంది...తాగి పారేసిన వాటర్ బాటిల్స్, సిగరెట్ పీకలు, మద్యం బాటిల్స్ లాంటివి కనిపిస్తున్నాయి. తరచూ శుభ్రం చేస్తున్న దాఖలాలు లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. దుర్వాసన భరించలేక  ప్రయాణికులు అసలు బస్ షెల్టర్లలోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. మరికొన్ని బస్ షెల్టర్ల ముందు నుంచే మురుగు నీరు ప్రవహిస్తున్నా... అధికారులకు పట్టడం లేదు. కోఠి బస్టాప్ లోని షెల్టర్లకు కాంట్రాక్టర్ తాళం వేసుకొని వెళ్తున్నట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు

బస్ షెల్టర్లపై ప్రకటనల ద్వారా కోట్ల ఆదాయం

సిటీ బస్ షెల్టర్లపై ఇస్తున్న ప్రకటనల ద్వారా జీహెచ్ఎంసీకి ప్రతి యేటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అధికారులు కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టి బస్ షెల్టర్ల నిర్వహణని ఏమాత్రం పట్టించుకోవట్లేదని జనం మండిపడుతున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ నగరంలో బస్ షెల్టర్ల నిర్వహణను ప్రభుత్వం, సంబంధిత అధికారులు పట్టించుకుని ఉపయోగపడేలా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.