కర్తవ్య పథ్ లో ఒగ్గు డోలు కవాతు.!

కర్తవ్య పథ్ లో  ఒగ్గు డోలు కవాతు.!
  • రిపబ్లిక్  వేడుకల్లో ప్రదర్శన చేయనున్న మన ఒగ్గు కళాకారులు
  • 7న ఢిల్లీకి 30 మంది బృందం
  • జనగామ, సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుంచి కళాకారుల ఎంపిక


హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మట్టి పరిమళం, పల్లె సంస్కృతికి ప్రతీకైన ‘ఒగ్గుడోలు’ ఈసారి ఢిల్లీలో మార్మోగనుంది. రిపబ్లిక్  డే రోజు దేశ రాజధానిలోని ‘కర్తవ్యపథ్’లో జరిగే వేడుకల్లో మన కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఎన్నో కళారూపాలు ఢిల్లీకి వెళ్లినా.. ఒగ్గుడోలు విన్యాసానికి రిపబ్లిక్  డే పరేడ్‌లో చోటు దక్కడం ఇదే తొలిసారి. ఈ చారిత్రక ప్రదర్శన కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 30 మంది కళాకారులను ఎంపిక చేశారు. వీరంతా 7న ఢిల్లీకి వెళ్లనుండగా.. 8 నుంచి రిహార్సల్స్​ ప్రారంభం కానున్నాయి. 

సౌత్​ సెంట్రల్​ జోన్​ కల్చరల్​ సెంటర్ తరఫున ప్రదర్శన..

దేశంలో ఏడు జోనల్ ​సెంటర్లు ఉండగా.. ఇందులో నాగ్‌పూర్‌లోని దక్షిణ మధ్య క్షేత్ర సాంస్కృతిక కేంద్రం (సౌత్  సెంట్రల్  జోన్  కల్చరల్ సెంటర్) ఆధ్వర్యంలో ఒగ్గు కళాకారులు  ప్రదర్శన ఇవ్వనున్నారు. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత ఒగ్గుడోలు కళాకారుడు డాక్టర్  ఒగ్గు రవి ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. జనగామ, సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి ప్రతిభావంతులైన 30 మంది కళాకారులను ఈ ప్రదర్శన కోసం ఎంపిక చేశారు. ఢిల్లీలో ఈ నెల 8 నుంచి 25 వరకు  రిహార్సల్స్‌  చేయనున్నారు. 26న రిపబ్లిక్​ డే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంగద్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు, విదేశీ అతిథుల సమక్షంలో ఒగ్గుడోలు విన్యాసాలు ప్రదర్శించనున్నారు. 

‘హాకా’ లాగా ఒగ్గుకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఒగ్గు రవి

ఒకప్పుడు మల్లన్న గుడి ఆవరణకు, బీరప్ప ఉత్సవాలకు పరిమితమైన ఈ కళను.. మిద్దె రాములు, చుక్క సత్తయ్య వంటి దిగ్గజాలు ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేల సంఖ్యలో ఒగ్గు కళాకారులు ఉన్నారు. కురుమ సంఘాలు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహంతో యువత ఈ కళ వైపు ఆకర్షితులవుతోంది. చాలా మంది కళాకారులు పేదరికంలోనే ఉంటూ ఆచారంగా భక్తితో ఈ కళను బతికిస్తున్నారు. ఆదివాసీ, గిరిజన, వివిధ వర్గాలకు సంబంధించిన కళలను బతికించుకునేందుకు కళాక్షేత్రాలు ఏర్పాటు చేయాలి. న్యూజిలాండ్​లో సంప్రదాయ కళలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వారి కళారూపం ‘హాకా’ ప్రదర్శించిన తర్వాతే వేరే కళలకు అవకాశం ఇస్తారు. మన దగ్గర కూడా అలాగే ప్రాధాన్యం ఇవ్వాలి.

తెలంగాణ సంస్కృతికి పెద్దపీట

ఒగ్గుడోలు జానపద కళారూపం మాత్రమే కాదు,  తెలంగాణ సాంస్కృతిక జీవనంలో  భాగం. ప్రధానంగా కురుమ, గొల్ల కులస్తులు తమ ఆరాధ్య దైవాలైన మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మల కథలను గానం చేస్తూ.. డోలు వాయిస్తూ చేసే ప్రదర్శనే ఒగ్గుడోలు. ఒగ్గు అంటే శివుడి చేతిలోని ‘డమరుకం’ అని అర్థం. ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తూ కథలు చెప్పడం వల్ల దీనికి ‘ఒగ్గు కథ’ అని పేరొచ్చింది. కళాకారులు తరతరాలుగా వస్తున్న ఈ కళను బతికించుకుంటూ నేటి తరానికి అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై సత్తా చాటిన ఒగ్గు కళాకారులు.. ఇప్పుడు  కర్తవ్యపథ్‌లో ప్రదర్శన చేయనుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.