మరోసారి పెట్రో ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు

మరోసారి పెట్రో ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు

చమురు కంపెనీలు మరోసారి పెట్రో ధరలు పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇప్పటి వరకు 19 సార్లు చమురు ధరలు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్ టైమ్  గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై 4 రూపాయల 71 పైసలు, డీజిల్‌పై 5 రూపాయల 28 పైసలు పెరిగింది. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 95 రూపాయల 3 పైసలకు, డీజిల్ ధర 85 రూపాయల 95 పైసలకు చేరింది. 

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోలు ధరలు 100 రూపాయలు దాటాయి. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర 105 రూపాయల 33 పైసలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 101 రూపాయల 45 పైసలుగా ఉంది. హైదరాబాద్‌లో రూ.98.76కు చేరింది. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.