రష్యా క్రూడ్ ఆయిల్ మరింత అగ్గువ..రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే చాన్స్

రష్యా క్రూడ్ ఆయిల్ మరింత అగ్గువ..రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే చాన్స్
  • ఇప్పటికే బ్యారెల్​కు 5 డాలర్లకు పైగా డిస్కౌంట్ 
  • రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే చాన్స్ 
  • అమెరికా, ఈయూ ఆంక్షల నేపథ్యంలో భారత్​కు రష్యా భారీ డిస్కౌంట్ 

న్యూఢిల్లీ: భారత్ కు రష్యా క్రూడ్ ఆయిల్ మరింత అగ్గువకే దొరకనుంది. ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల నేపథ్యంలో రష్యా ఇప్పటికే భారత్ కు డిస్కౌంట్ తో ఆయిల్ సరఫరా చేస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు 67 డాలర్ల వరకూ ఉండగా, రష్యా (ఉరల్స్) ముడి చమురు ధర అంతకంటే 5కుపైగా డాలర్లు తక్కువగా ఉంది. రెండు వారాల కిందట బ్రెంట్, ఉరల్స్ ముడి చమురు ధరలు దాదాపు సమానంగా ఉండగా, తాజాగా మారిన పరిస్థితుల వల్ల ఉరల్స్ ఆయిల్ ధర తగ్గింది.

 అయితే, రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు భారత్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 50 శాతం వరకూ టారిఫ్​లను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని, భారత్ కు మరింత డిస్కౌంట్ తో సరఫరా చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆఫర్ చేసినట్టుగా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘కెప్లర్ లిమిటెడ్’ వెల్లడించింది. ఈ నెల నుంచి అక్టోబర్ వరకూ భారత్ కు రష్యన్ క్రూడ్ ఆయిల్ మరింత అగ్గువకే అందుబాటులోకి రావచ్చని ఈ సంస్థ పేర్కొంది. 

ఇండియన్ కంపెనీలు దాదాపు 37% క్రూడ్ ఆయిల్ ను రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుండటంతో ఇప్పటికిప్పుడు దిగుమతులు ఆపే అవకాశం లేదని తెలిపింది. అయితే, రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపే విషయాన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు పరిశీలిస్తుండగా.. ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు మాత్రం తక్కువ ధరకే వస్తుండటంతో రష్యా ఆయిల్ వైపే మొగ్గు చూపుతున్నాయని కెప్లర్ సంస్థ వివరించింది.

రష్యా నుంచి కొనుగోళ్లు ఆపేస్తే..

అమెరికా నుంచి ఇండియా క్రూడ్ ఆయిల్ దిగుమతులు కూడా గత మే నెల నుంచీ రోజుకు 2.25 లక్షల బ్యారెల్స్ కు పెరిగాయని, ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఈ దిగుమతులు రెట్టింపు అని పేర్కొంది. కాగా, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను భారత్ పూర్తిగా ఆపేస్తే ఇంపోర్ట్ బిల్లులు ఈ ఆర్థిక సంవత్సరంలో 9 బిలియన్ డాలర్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12 బిలియన్ డాలర్ల మేరకు పెరుగుతాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది.