
అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయిల్‌పామ్ హబ్‌గా మారడం అభినందనీయం అని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేటలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను బుధవారం ఆయన సందర్శించారు. అలాగే అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలోని ఆయిల్‌పామ్ నర్సరీలో మొక్కలను పరిశీలించారు.
ఈ సందర్భంగా నర్సరీ మెయింటెనెన్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాసెసింగ్ మిల్లులో అత్యాధునిక టెక్నాలజీ వాడడం వల్ల ఫ్రూట్ బంచ్ ప్రాసెస్ మెరుగ్గా జరిగి రైతులకు మంచి ధర వస్తుందన్నారు. దేశంలో ఏడాదికి కోటి టన్నుల ఆయిల్ పామ్ అవసరం కాగా మూడు లక్షల టన్నులే అందుబాటులో ఉందని, దీనివల్ల మిగతాది మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు.
కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ ఇతర జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచుతామన్నారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. అనంతరం దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేస్తున్న రైతు ఆలపాటి రామచంద్ర ప్రసాద్‌ను కలిశారు. ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని, దీంతో ఖర్చులు పోను ఎకరాకు రూ. లక్ష ఆదాయం వస్తుందని రైతు తెలిపారు. ఆయన వెంట కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్లు బాలకృష్ణ, శ్రీకాంత్‌రెడ్డి, నాగబాబు, కళ్యాణ్ పాల్గొన్నారు.