- వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం.. పెరగనున్న ద్రవ్యోల్బణం
- నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం
- భారీగా పతనమవుతున్న రూపాయి.. డాలర్తో పోలిస్తే 95కు డౌన్
- ప్రభుత్వంపై ఎరువులు, ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ సబ్సిడీల భారం
- ఇరాన్, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియా దేశాలపై తీవ్ర ప్రభావం
- క్రూడ్ ధర 140 డాలర్లకూ చేరొచ్చు.. దీనికి కారణం అమెరికానే: ఇరాన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాల్లోనూ చమురు మంటలు రేగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర తాజాగా125 డాలర్లకు చేరింది. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు క్రూడ్ ఆయిల్ ధర 60 నుంచి 70 డాలర్లు ఉండగా.. ఇప్పుడు దాదాపు100 శాతం వరకూ పెరిగింది. దీంతో ఇండియా సహా అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రూపాయి క్షీణిస్తోంది.
క్రూడ్ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే సామాన్యుడిపై డైరెక్ట్‌గా ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉన్నది. కేంద్ర ప్రభుత్వంపైనా ఎరువులు, ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ సబ్సిడీల భారం పెరుగుతోంది. దీంతో దేశంలోని వివిధ రంగాలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా పడుతోంది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో కదలిక లేకపోవడంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేటట్టు కనిపించడం లేదు. ఉద్రిక్తతలు మరింత పెరిగితే బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 150 డాలర్లకూ చేరుకోవచ్చని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కొత్త మార్కెట్లలో 5–15 డాలర్లు అదనం..
ఇండియా రోజుకు 50 లక్షల బ్యారెల్స్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. యుద్ధానికి ముందు ఇందులో 55–60 శాతం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చేది. హార్మూజ్ జల సంధి మూతపడిన తర్వాత ఈ వాటా 25–27 శాతానికి పడిపోయింది. ఇరాక్, కువైట్, ఖతార్ నుంచి సప్లయ్ పూర్తిగా ఆగిపోయింది. దీంతో రష్యా, నైజీరియా, అంగోలా, వెనెజువెలా, మెక్సికో నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నది. కానీ, కొత్త మార్కెట్ల నుంచి ఆయిల్ కొనడానికి అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
సాధారణంగా భారత రిఫైనరీలు బ్రెంట్ (స్వీట్)+ ఒమన్/దుబాయ్ (సవర్) గ్రేడ్ మిశ్రమం కొనుగోలు చేస్తాయి. దీని ధర గత రెండు వారాల్లోనే బ్యారెల్‌కు 100 డాలర్ల నుంచి 117 డాలర్లకు చేరింది. దీనికి తోడు సప్లయ్ పెంచుకోవడానికి అదనంగా 5 నుంచి-15 డాలర్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో అనేక రకాలుగా నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
డాలర్ల ఖర్చు పెరుగుతోంది..
ఆయిల్ దిగుమతుల కోసం ఎక్కువ (డాలర్లలో) చెల్లిస్తున్నాం. దీంతో మన ఫారెక్స్ రిజర్వ్‌లు తగ్గిపోతున్నాయి. క్రూడాయిల్ ధరలు మరింత పెరుగుతాయని ట్రేడర్లు భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో డాలర్ల కొనుగోలు (రూపాయి నుంచి డాలర్లకు కన్వర్షన్) పెరుగుతున్నాయి. దీనికితోడు విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి బయటకొచ్చేయడంతో కూడా డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. వీరు కూడా తమ రూపాయిలను డాలర్లలోకి మారుస్తారు.
ఇండియాలోకి వచ్చే డాలర్ల కంటే బయటకు వెళ్లే డాలర్లు ఎక్కువవ్వడంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్(సీఏడీ) పెరుగుతోంది. ఈ ఏడాది సీఏడీ దాదాపు 84 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025లో ఇది సుమారు 30–31 బిలియన్ డాలర్ల మధ్యే ఉంది. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే రెమిటెన్స్ ఈసారి భారీగా పడిపోనుండడంతో కూడా సీఏడీ భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఒత్తిడిలో రూపాయి
డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ పడిపోతోంది. సాధారణంగా ట్రేడర్లు, విదేశీ పెట్టుబడుదారులు తమ దగ్గరున్న రూపాయిని డాలర్లలోకి కన్వర్ట్ చేస్తారు. డాలర్లను కొనేందుకు ఎక్కువ రూపాయిలను ఇవ్వడానికి ముందుకొస్తారు. దీంతో రూపాయి విలువ క్షీణిస్తుంది. ఈ ఏడాది రూపాయి విలువ 11 శాతం పడిపోవడానికి డాలర్ కొనుగోళ్లు పెరగడమే కారణం. డాలర్‌తో రూపాయి గురువారం 95.22 కి క్షీణించింది. క్రూడాయిల్ ధరలు గరిష్టాల్లో కొనసాగితే మన కరెన్సీపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.
ఈఎంఐల భారం పెరగొచ్చు..
రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతులు ఖరీదుగా మారాయి. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం కూడా 6 శాతానికి చేరొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే వస్తువులు, సేవల ధరలు పెరిగి, సామాన్యుడి జేబు ఖాళీ అవుతుంది. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకునే లోన్లపై వడ్డీ ఎక్కువవుతుంది. ఇప్పటికే తీసుకున్న హోమ్, వెహికల్ లోన్ వంటి రెపో లింక్డ్ లోన్లపై ఈఎంఐ భారం పెరుగుతుంది.
భారీగా పెరిగిన ప్రభుత్వ ఖర్చులు
ప్రభుత్వ ఫిస్కల్ డెఫిసిట్(ఖర్చులు మైనస్ ఆదాయం) కూడా పెరుగుతోంది. ఇండియాలో క్రూడాయిల్ రేట్లకు తగ్గట్టు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఎల్‌పీజీ, ఎరువులపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. గవర్నమెంట్ చెల్లించే ఎరువుల సబ్సిడీ గతంలోని రూ.1.77 లక్షల కోట్ల నుంచి ఈసారి రూ.2 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకపోవడం వలన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు దాదాపు రూ.80 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎల్‌పీజీ సబ్సిడీ కింద 2025–26 లో రూ.9 వేల నుంచి10 వేల కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం చేసే ఖర్చులు పెరగడంతో ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువవుతోంది. దీంతో డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్ కొనసాగించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
జీడీపీ డౌన్..
చమురు ధరలు ఎక్కువ కాలం 100 డాలర్లపైన ఉంటే, భారత జీడీపీ వృద్ధి రేటు సుమారు 0.40 శాతం నుంచి 0.50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, మూడీస్, గోల్డ్‌మన్ సాచ్స్, స్టాండర్డ్ చార్టర్డ్, ఓఈసీడీ, ఫిచ్, ఎస్ అండ్ పీ వంటి గ్లోబల్ సంస్థలు తగ్గించాయి. గతంలో సుమారు 7 శాతం వృద్ధి రేటును అంచనా వేసిన సంస్థలు, ప్రస్తుతం 6 శాతం వృద్ధి మాత్రమే నమోదవుతుందని పేర్కొన్నాయి.
క్రూడ్ ధరల పెరుగుదలకు అమెరికానే కారణం: ఇరాన్
హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధంతో ఆయిల్ ధరలు బ్యారెల్‌కు120 డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అక్కడి అధికారులు చెత్త సలహాలు ఇస్తున్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ అన్నారు. ఈ మేరకు 'ఎక్స్'లో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘మూడు రోజులు గడిచినా, ఇక్కడ ఏ చమురు బావీ పేలలేదు. అమెరికన్లే ఈ దిగ్బంధం సిద్ధాంతాన్ని రుద్ది చమురు ధరలను120 డాలర్ల పైచిలుకుకు చేర్చారు. వారి తదుపరి లక్ష్యం 140 డాలర్లు. ఇక్కడ సమస్య సిద్ధాంతం కాదు, వారి ఆలోచనా విధానం’’ అని తఘాలిబాఫ్ పేర్కొన్నారు.
ఇండియాపై ఎఫెక్ట్ ఇలా..
* డాలర్ల ఖర్చు పెరుగుతోంది: ఆయిల్ దిగుమతుల కోసం ఎక్కువ (డాలర్లలో) చెల్లిస్తున్నాం. దీంతో మన ఫారెక్స్ రిజర్వ్‌లు తగ్గిపోతున్నాయి.
* ఒత్తిడిలో రూపాయి: డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ పడిపోతోంది. డాలర్‌తో రూపాయి గురువారం 95.22కి క్షీణించింది.
* ధరలు పెరుగుతయ్: రూపాయి విలువ పడిపోతే వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుంది. లోన్లపై వడ్డీలు పెరుగుతాయి.
* కంపెనీల లాభాలు తగ్గుతయ్: ఏవియేషన్, ఎరువులు, పెయింట్స్, కెమికల్స్ కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయి. వీటి ముడి సరుకుల ధరలు పెరుగుతాయి.
* జీడీపీ డౌన్: చమురు ధరలు ఎక్కువ కాలం 100 డాలర్లపైన ఉంటే, భారత జీడీపీ వృద్ధి రేటు సుమారు 0.40 శాతం నుంచి 0.50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

