
- వంధ్యత్వ మొక్కలుగా గుర్తింపు
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు వేల ఎకరాల్లో నష్టం..
- 200 మంది బాధితులు
- జిల్లాలో పెరుగుతున్న బాధిత రైతుల సంఖ్య
- కంపెనీల నుంచి పరిహారం ఇప్పించాలంటున్న రైతులు
ఖమ్మం, వెలుగు : ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతులను ‘ఆఫ్ టైప్’ మొక్కల సమస్య వేధిస్తోంది. నాలుగైదేండ్ల కింద సాగు చేసిన వాటిలో కొన్ని మొక్కలకు మరుగుజ్జు గెలలు వస్తుండగా.. మరికొన్నింటికి అసలు గెలలే రావడం లేదు. దీంతో వాటిని వంధ్యత్వ మొక్కలుగా గుర్తించారు. రోజులు గడుస్తున్న కొద్దీ బాధిత రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 200 మందికి పైగా రైతులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా... సుమారు 3 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.లక్ష చొప్పున ఇప్పటివరకు ఎకరానికి రూ.4 లక్షల మేర నష్టపోయామని, ఈ డబ్బులను మొక్కలు పంపిణీ చేసిన కంపెనీల నుంచి ఇప్పించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
2020 తర్వాత పంపిణీ చేసిన మొక్కల్లోనే సమస్య !
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 60 వేలకు పైగా ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. గతంలో అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎక్కువ విస్తీర్ణంలో తోటలు ఉండగా, గత పదేండ్లలో మిగతా నియోజకవర్గాల్లోనూ తోటల సాగు పెరిగింది. ఒక ఎకరా తోటలో 57 మొక్కలను నాటుతారు. ఆయిల్‌పామ్ మొక్కలను నేరుగా విత్తడంగానీ, సీడ్ డెవలప్ చేయడంగానీ మన దేశంలో సాధ్యం కాదు.
దీంతో ఇండోనేషియా, థాయ్‌లాండ్, కోస్టారికా, మలేషియా వంటి దేశాల నుంచి నారు దిగుమతి చేసుకొని, స్థానిక నర్సరీల్లో ఏడాది పాటు పెంచిన తర్వాత రైతులకు పంపిణీ చేస్తున్నారు. 2020 తర్వాత ఇతర దేశాల నుంచి తెచ్చిన నారులోనే ఆఫ్ టైప్ మొక్కల సమస్య ఏర్పడింది. అయితే ప్రతి బ్యాచ్‌లో 20 శాతం వరకు ఇలాంటి మొక్కలు వచ్చే అవకాశం ఉంటుందని, అనుభవం ఉన్న వారు నర్సరీల్లో గుర్తించడం వల్ల సమస్య తలెత్తకుండా చూసే అవకాశం ఉంటుందన్నారు.
అయితే ఆయా నర్సరీల్లో 2020, 2021 సంవత్సరాల్లో కొందరు ఆఫీసర్లు అప్పుడున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని ఏపీకి చెందిన రైతులకు అక్రమంగా మొక్కలు అమ్ముకున్నారని.. ఆ సంఖ్యను సరిచేసేందుకు స్థానికంగా పెంచిన మొక్కలను ఇక్కడి రైతులకు అంటగట్టారని ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేట మండలం దిబ్బగూడెంలోని తోటల్లో నాలుగేండ్ల కింద మొక్కలకు అంట్లు కట్టి, నర్సరీల్లో పెంచి ఉమ్మడి జిల్లా రైతులకు ఇచ్చారని చెబుతున్నారు. ఈ కారణం వల్లే రెండు, మూడు నర్సరీల నుంచి పంపిణీ చేసిన మొక్కలతోనే ఈ సమస్య వచ్చిందని అంటున్నారు.
పెరుగుతున్న బాధితుల సంఖ్య
ఆఫ్ టైప్ మొక్కల బాధితుల సంఖ్య గతేడాది నుంచి క్రమంగా పెరుగుతోంది. 2021, 22లో ఖమ్మం జిల్లా రేగళ్లపాడు నర్సరీలో రైతులకు పంపిణీ చేయకముందే సుమారు మూడు లక్షల మొక్కలు ఫెయిలయ్యాయి. దీంతో కోస్టారికాకు చెందిన కంపెనీ నుంచి ఆయిల్‌ఫెడ్‌కు రూ.1.30 కోట్ల వరకు పరిహారం వచ్చిందని సమాచారం.
అయితే రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీల నర్సరీల నుంచి తీసుకున్న మొక్కలు సరిగానే ఉన్నా... ఆయిల్‌ఫెడ్ నర్సరీల నుంచి తీసుకున్న మొక్కల్లోనే ఆఫ్ టైప్ సమస్య వేధిస్తోంది. దీంతో ఆయా నర్సరీల ఇన్‌చార్జులు, ఆఫీసర్ల ప్రమేయంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇద్దరు కింది స్థాయి సిబ్బందిని బాధ్యులుగా గుర్తించి సస్పెండ్ చేసినా, నష్టపోయిన రైతులకు మాత్రం పరిహారం దక్కలేదు.
మొక్కలను పరిశీలించిన సైంటిస్ట్‌లు
ఆఫ్ టైప్ మొక్కల సమస్య ఎదుర్కొంటున్న రైతులు కొన్నాళ్లుగా ఆయిల్‌ఫెడ్ చైర్మన్‌కు, హార్టికల్చర్ ఆఫీసర్లకు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి సైతం తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు... కేంద్ర ప్రతినిధుల బృందం ఇటీవల సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో 14 తోటల్లో ఆయిల్‌పామ్ మొక్కలను పరిశీలించింది.
ఏపీలోని ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చ్ (ఐఐఓపీఆర్) సైంటిస్టులు సైతం గత నెల, ఈ నెల మొదటి వారంలో ఆఫ్ టైప్ మొక్కలను పరిశీలించి 100 శాంపిళ్లు సేకరించారు. ఆ రిపోర్ట్ వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుంతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
రైతులకు పరిహారం ఇవ్వాలి
ఆఫ్ టైప్ మొక్కల కారణంగా వందలాది మంది రైతులు నష్టపోయారు. సరైన మొక్కలు సరఫరా చేయడంలో విఫలమైన కంపెనీలు, ఆయిల్‌ఫెడ్ నుంచే రైతులకు పరిహారం ఇచ్చేలా చూడాలి. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని ఆఫీసర్లు చెబుతున్నారు. అవసరమైతే చట్టాన్ని సవరించి అయినా రైతులకు న్యాయం చేయాలి.– తుంబూరు ఉమామహేశ్వర్‌రెడ్డి, రైతు, అశ్వారావుపేట