
వాషింగ్టన్: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై సెకండరీ టారిఫ్లు వేస్తామని చెప్పిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. చైనాపై మాత్రం వేయలేదు! దీనికి ఓ కారణం ఉందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో చెప్పుకొచ్చారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
‘‘రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని చెప్పి చైనాపై సెకండరీ టారిఫ్లు వేస్తే ప్రపంచమంతా ఆయిల్ రేట్లు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే వెనక్కి తగ్గాం. చైనా, భారత్‌పై 100% టారిఫ్లు వేసే బిల్లుపై సెనెట్‌లో జరిగిన చర్చలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిని యూరప్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే చైనాపై సెకండరీ టారిఫ్లు వేయలేదు” అని పేర్కొన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని చెప్పి ఇండియాపై మాత్రం 25% సెకండరీ టారిఫ్లు వేసిన ట్రంప్.. ఈ నెల 27 నుంచి అమలులోకి వస్తాయని అప్పట్లోనే ప్రకటించారు. అయితే.. రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చల నేపథ్యంలో దీనిపై పునరాలోచిస్తామని ట్రంప్ రెండు రోజుల కింద తెలిపారు.