కర్నాటకలో ఓలా, ఉబర్‌‌‌‌ ఆటో సర్వీసుల బ్యాన్‌‌పై స్టే

కర్నాటకలో ఓలా, ఉబర్‌‌‌‌ ఆటో సర్వీసుల బ్యాన్‌‌పై స్టే

బెంగళూరు: కర్నాటకలో ఓలా, ఉబర్‌‌‌‌, రాపిడో అగ్రిగేటర్లకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయా సంస్థల ఆటో సర్వీసుల బ్యాన్‌‌పై స్టే విధించింది. ప్రజల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర రవాణా శాఖ ఆయా సంస్థల సర్వీసులపై బ్యాన్‌‌ విధించింది. దీంతో బ్యాన్‌‌ ఉత్తర్వులపై ఓలా, ఉబర్‌‌‌‌ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, సర్వీసుల బ్యాన్‌‌పై స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

చట్టం ప్రకారం, చార్జీలను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదనపు సర్వీస్‌‌ చార్జీలపై 10 నుంచి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించే వరకు ఆటో అగ్రిగేటర్లపై చర్యలు తీసుకోవద్దని చెప్పింది. అలాగే, 5 శాతం జీఎస్టీతో పాటు బేస్‌‌ చార్జీపై 10% అదనంగా వసూలు చేయడానికి హైకోర్టు ఆటో అగ్రిగేటర్లకు అనుమతించింది. తర్వాత విచారణను నవంబర్‌‌‌‌ 7కు వాయిదా వేసింది. ‘‘హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. అగ్రిగేటర్‌‌‌‌ ప్లాట్‌‌ ఫారంలను ఉపయోగించి ఆపరేట్‌‌ చేసే హక్కు ఆటో డ్రైవర్లకు ఉందని కోర్టు గుర్తించింది. ఈ ఉత్తర్వులతో ఉబర్‌‌‌‌ వంటి ప్లాట్‌‌ఫారంలు బుకింగ్‌‌ చార్జీలు వసూలు చేసుకోవచ్చని కోర్టు చెప్పినట్లయింది”అని ఉబర్‌‌‌‌ ప్రతినిధి చెప్పారు.