నో బుకింగ్స్ : చెన్నైలో ఓలా, ఉబర్ క్యాబ్స్ బంద్.. కారణాలు ఏంటీ..?

నో బుకింగ్స్ : చెన్నైలో ఓలా, ఉబర్ క్యాబ్స్ బంద్.. కారణాలు ఏంటీ..?

నగరంలో బైక్ - ట్యాక్సీ సేవలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. దాంతో పాటు సిటీలో చట్టవిరుద్ధంగా పని చేస్తోన్న టోల్ బూత్ ల సమస్యను పరిష్కరించాలని వారు రాష్ట్ర రహదారి శాఖను కోరినట్టు పలు నివేదికలు తెలిపాయి.

చట్టవిరుద్దంగా టోల్ బూత్ లు, రాపిడో వంటి బైక్, ట్యాక్సీ సేవలను నిర్వహించడం వల్ల తమ సంపాదనపై తీవ్ర ప్రభావం పడుతోందని క్యాబ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. దానికి వ్యతిరేకంగానే ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్టు చెబుతున్నారు.

ఈ ఏడాది జూన్‌లో, ద్విచక్ర వాహనాలను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించడం వల్ల ప్రయాణికుల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని తెలుపుతూ.. బైక్-టాక్సీలపై నిషేధాన్ని అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
 
2019 జూలైలో రాపిడో బైక్ - ట్యాక్సీ సేవలను తీసుకువచ్చిన కొద్ది రోజులకే రాష్ట్ర రవాణాశాఖ ద్విచక్ర వాహనాల జప్తును ప్రారంభించింది. గూగుల్, ఆపిల్ ఇండియా, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కి ఆయా ఫ్లాట్ ఫారమ్స్ నుంచి యాప్స్ ను తొలగించాలని  ఆదేశాలు జారీ చేసింది.