బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన పాతగుట్ట

బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన  పాతగుట్ట
  • నేటి నుంచి ఫిబ్రవరి 3 వరకు వేడుకలు
  • స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న అర్చకులు
  • 30న ఎదుర్కోలు, 31న కల్యాణం, ఫిబ్రవరి 1న రథోత్సవం
  • ఫిబ్రవరి 3న అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగింపు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 28(బుధవారం) నుండి ఫిబ్రవరి 3 వరకు.. ఏడు రోజుల పాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల కోసం ఆలయ ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి  చేశారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయ ప్రాంగణంలో స్పెషల్ లైటింగ్, భక్తులు సేద తీరడం కోసం చలువ పందిళ్లు, మంచినీటి వసతితో పాటు ఆలయానికి, కల్యాణ మండపానికి రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. యాదగిరిగుట్టలోని పాతగుట్ట చౌరస్తా నుండి పాతగుట్ట ఆలయం వరకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు పోలీసులతో ప్రత్యేక నిఘా, పటిష్ట బందోబస్తు  ఏర్పాటు చేశారు.

స్వస్తివాచనంతో షురూ కానున్న బ్రహ్మోత్సవాలు

పాతగుట్టలో గత నాలుగు రోజులుగా జరిగిన అధ్యయనోత్సవాలకు మంగళవారం 'నూత్తందాది శాత్తుమొరై' పూజలతో ముగింపు పలికిన అర్చకులు.. బుధవారం స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురారోపణం, మృత్సంగ్రహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టాలు ఈ నెల 30న ఎదుర్కోలు, 31న తిరుకల్యాణం, ఫిబ్రవరి 1న దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా వారం రోజుల పాటు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పలు రకాల స్వామివారి అలంకార సేవలను చేపట్టనున్నారు. దీనికోసం స్వామివారి వాహనాలను సిద్ధం చేశారు. 

ఇక ఈ నెల 31న రాత్రి నిర్వహించే స్వామివారి తిరుకల్యాణంలో భక్తులు పాల్గొనడానికి కల్యాణ టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. భక్తులకు విక్రయించే బ్రహ్మోత్సవ కల్యాణ టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించారు. ఫిబ్రవరి 3న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.

ఇక అధ్యయనోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఈ నెల 24 నుండి ఫిబ్రవరి 3 వరకు భక్తుల చేత నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4 నుండి ఆర్జిత సేవలను తిరిగి పునరుద్దరణ కానున్నాయి.

పాతగుట్ట బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరాలు

28.01.2026 ఉదయం స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం.. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం
29.01.2026 ఉదయం ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ట, వేదపారాయణాలు.. సాయంత్రం భేరిపూజ, దేవతాహ్వానం
30.01.2026 ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం, ఎదుర్కోలు(అశ్వవాహన సేవ)
31.01.2026 ఉదయం తిరుమంజనం, హనుమంత వాహన సేవ.. రాత్రి తిరుకల్యాణం(గజవాహన సేవ)
01.02.2026 ఉదయం గరుడ వాహన సేవ.. సాయంత్రం రథాంగ హోమం, దివ్యవిమాన రథోత్సవం
02.02.2026 ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం.. సాయంత్రం దేవతోద్వాసన, పుష్పయాగం, డోలోత్సవం
03.02.2026 ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం.. మధ్యాహ్నం మహదాశీర్వచనం, పండిత సన్మానం, ఉత్సవసమాప్తి