29 నుంచి సెక్రటేరియట్ కు తాళం..ఖాళీ చేయాలని జీఏడీ ఆదేశం

29 నుంచి సెక్రటేరియట్ కు తాళం..ఖాళీ చేయాలని జీఏడీ ఆదేశం
  • పూర్తిగా ఖాళీ చేయాలని శాఖలకు ఆదేశాలు
  • ఆదివారం నుంచి తాళాలు వేసేయాలని నిర్ణయం
  • కూల్చివేత కోసం టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం!
  • కొత్త సెక్రటేరియట్​ డిజైన్​ను ఫైనల్​ చేయనున్న సీఎం కేసీఆర్
  • బీఆర్కే భవన్​లో మంత్రులకు కేటాయించిన చాంబర్ల రెనోవేషన్​ మొదలు

హైదరాబాద్, వెలుగుతెలంగాణ సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాళం పడనుంది. ఆదివారం నుంచి సెక్రటేరియట్ కు తాళం వేయాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) అధికారులు నిర్ణయించారు. అన్ని శాఖలు వెంటనే ఖాళీ చేయాలని, వారి సామగ్రిని 24 గంటల్లోగా తీసుకెళ్లాలని జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెక్రటేరియట్ షిఫ్టింగ్ దాదాపుగా ముగియనుంది. ఇప్పటికే లుంబినీ పార్కు వైపు ఉన్న సెక్రటేరియట్ ఏపీ గేటుకు తాళం వేశారు. ఆదివారం నుంచి మింట్ కంపౌండ్ వైపు ఉండే తెలంగాణ సెక్రటేరియట్ గేట్ కు తాళం వేయనున్నారు. కొంతమంది ఉద్యోగులు, మీడియా మినహా పాత సెక్రటేరియట్ కు వచ్చేవారి సంఖ్య ఇప్పటికే చాలా తగ్గింది. కొద్ది రోజులుగా జీఏడీ అధికారులు పాత సెక్రటేరియట్ లోని అన్ని బ్లాకులు పరిశీలిస్తూ మిగిలి ఉన్న సామగ్రి, షిఫ్టింగ్ ఎంత అయిందన్న దానిపై ఉన్నతాధికారులకు రోజువారీ నివేదికలు ఇస్తున్నారు.

చివరి దశకు షిఫ్టింగ్ 

ఆగస్టు 8న స్టార్ట్ అయిన సెక్రటేరియట్ షిఫ్టింగ్ చివరి దశకు చేరుకుంది. 70 శాతం పూర్తయిందని ఇటీవల అసెంబ్లీలో ఆర్ & బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు 90 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం జీఏడీ సామగ్రి, బీరువాలను తరలించారు. సెక్రటేరియట్ లో సీఎంవోను బేగంపేట మెట్రో రైల్ భవన్ కు తరలించగా, మిగతా శాఖలలో చాలావాటిని బీఆర్కే భవన్ కు తరలించారు. సుమారు నెల రోజుల నుంచి బీఆర్కే భవన్ నుంచే పరిపాలన సాగుతోంది. సీఎస్ జోషి తో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు కొంతమంది ఉన్నతాధికారుల చాంబర్లు సిద్ధం కాగా, మరో వారం పది రోజుల్లో మిగతావారి చాంబర్లు పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

బయట నుంచే మంత్రుల కార్యకలాపాలు

సెక్రటేరియట్ షిఫ్ట్​ కావడంతో బీఆర్కే భవన్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో 9 మంది మంత్రులకు చాంబర్లు కేటాయించారు.  తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మరో ఆరుగురు మంత్రులను కేబినేట్ లోకి తీసుకోవటంతో అందరికి చాంబర్లు సిద్ధం చేస్తున్నారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి వారి శాఖల కార్యాలయాల నుంచి పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ  ఉండేందుకు మంత్రులు అయిష్టంగా ఉండటంతో ఇంతవరకు రెనోవేషన్ పనులు స్టార్ట్ కాలేదు. తాజాగా మంత్రుల చాంబర్లలో రెనోవేషన్ పనులు స్టార్ట్ అయ్యాయి. బీఆర్కే భవన్ లో రెనోవేషన్ పూర్తయ్యే వరకు మంత్రులు నగరంలోని వారి శాఖలకు చెందిన భవనాల నుంచి పని చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

దసరా ముందే కూల్చివేతపై నిర్ణయం?

షిఫ్టింగ్ చివరిదశకు చేరటంతో పాత సెక్రటేరియట్ ను ప్రభుత్వం ఇంప్లోజివ్ పద్ధతిలో కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన టెండర్లు, కూల్చివేయటంపై దసరా పండుగకు ముందే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త సెక్రటేరియట్  డిజైన్ ను కూడా త్వరలో సీఎం కేసీఆర్ ఫైనల్ చేయనున్నారు. కొత్త సెక్రటేరియట్ డిజైన్లను సీఎంకు అందజేసినట్లు ఇటీవల అధికారులు తెలిపారు. అన్ని కుదిరితే వచ్చే నెల చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.