ఓయూకు రూ.5 కోట్ల భారీ విరాళం

ఓయూకు రూ.5 కోట్ల భారీ విరాళం

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థి గోపాల్‌ టీకే కృష్ణ రూ.5  కోట్ల  భారీ విరాళం ప్రకటించారు.  ఆయన చదువుకున్న విభాగంలో ప్రతిపాదిత క్లాస్‌ రూం కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఈ విరాళాన్ని అందజేశారు. 106  సంవత్సరాల  ఓయూ చరిత్రలో  వ్యక్తిగతంగా అత్యధిక విరాళం అందజేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.  ఈ సందర్భంగా గోపాల్ టీకే  కృష్ణ దంపతులను ఇంజినీరింగ్ కాలేజీ అధికారులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.  

గోపాల్​ టీకే కృష్ణ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో 1968లో  బీఈ పూర్తి చేశారు.  అమెరికాలో స్థిరపడి రాజకీయంగా కూడా ఎదిగారు. అక్కడి రిపబ్లికన్​ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఓయూలో నిర్మించబోయే బిల్డింగులో ఆడిటోరియానికి ప్రొఫెసర్ వీఎం గాడ్గిల్​ పేరు,  కమిటీ హాలుకు ప్రొఫెసర్ ఆబిద్ అలీ పేరు, ల్యాబ్‌లకు అక్కడి  సిబ్బంది పేర్లు పెట్టాలని సూచించారు.  రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఈ భవన నిర్మాణానికి రూ.9.95 కోట్లు అంచనా వేసింది.