చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకుంటలేరు..

 చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకుంటలేరు..

జగిత్యాల టౌన్, వెలుగు: తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని, నాలుగు నెలలుగా చెప్పులు అరిగేలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కొమాకుల దేవమ్మ సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. అడిషనల్​కలెక్టర్ దివాకరను కలిసి అర్జీ అందజేసింది. 

ఈ సందర్భంగా దేవమ్మ మీడియాతో మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతోనే తన కొడుకు రాజేశం సూసైడ్​చేసుకున్నాడని ఆరోపించారు. కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని నాలుగు నెలలుగా పోలీసులు చుట్టూ తిరుగుతున్నానని వాపోయారు. సూసైడ్​నోట్​లో రాజేశం నలుగురు పేర్లు రాశాడని, పోలీసులు కనీసం వారిని ఎంక్వైరీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎస్సైలు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కాగా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన రాజేశం కొన్నేళ్లుగా కరీంనగర్​లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండేవాడు. ఓ భూ వివాదంలో కొందరు బెదిరింపులకు గురిచేయడంతో ఈ ఏడాది ఏప్రిల్ 18న కొండగట్టు గుట్ట ప్రాంతంలో రాజేశం ఉరి వేసుకున్నాడు. 

మృతుని జేబులో నలుగురు పేర్లను ప్రస్తావిస్తూ రాసిన సూసైడ్​లెటర్​దొరికింది. దీంతో తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని, కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని దేవమ్మ నాలుగు నెలలుగా పోరాడుతోంది.