బుక్కెడు బువ్వ పెడుతలేరు.. కొడుకులపై వృద్ధురాలు ఫిర్యాదు

బుక్కెడు బువ్వ పెడుతలేరు.. కొడుకులపై వృద్ధురాలు ఫిర్యాదు

 

  • కొడుకులపై పోలీస్ స్టేషన్ లో  కంప్లైంట్​ చేసిన వృద్ధురాలు

మెట్ పల్లి, వెలుగు:  ఇంట్లో నుంచి గెంటెసిన కొడుకులు బుక్కెడు అన్నం పెట్టడం లేదని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంపేట గ్రామానికి చెందిన ఎడపెళ్లి గంగు అనే వృద్ధురాలు పోలీసులకు కంప్లైంట్​ చేసింది. ఎడపెల్లి లక్ష్మీరాజం, గంగు దంపతులకు ముగ్గురు కొడుకులు. రజక వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నారు. కొన్నేండ్ల కింద లక్ష్మిరాజం చనిపోవడంతో ముగ్గురు కొడుకుల ఆలనా పాలన గంగు చూసుకుంది. ముగ్గురికి పెళ్లి చేసి ఆస్తిని పంచింది. నడిపి కొడుకు అనారోగ్యంతో పదేండ్ల కింద చనిపోయాడు. అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. శరీరం సహకరించకపోవడంతో గంగు తన బాగోగులు చూసుకోవాలని ఇద్దరు కొడుకులను కోరింది.

దీనికి తమ వల్ల కాదని పెద్ద కొడుకు లక్ష్మీరాజం, చిన్న కొడుకు గంగాధర్ ఒప్పుకోలేదు. కుల సంఘంలో పంచాయితీ చేశారు. గంగు బతికున్నంత కాలం 20 రోజులు పెద్ద కొడుకు, 10 రోజులు చిన్న కొడుకు ఆమె బాగోగులు చూసుకోవాలని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి చిన్న కొడుకు గంగాధర్ ఒప్పందం ప్రకారం తల్లి బాగోగులు చూస్తుండగా పెద్ద కొడుకు తిండి పెట్టకుండా ఇంట్లో ఉండకుండా బయటకు గెంటేశాడు. దీంతో గ్రామస్తులు ఇచ్చే డబ్బులతో ఓ రూము కిరాయికి తీసుకొని ఉంటోంది. చిన్న కొడుకు పరిస్థితి బాగా లేకపోవడంతో తల్లి బాగోగులు చూడడానికి కష్టంగా మారిందని చెబుతున్నాడని..పెద్ద కొడుకు అసలు పట్టించుకోవడం లేదని గంగు మెట్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. సీఐ లక్ష్మి నారాయణకు తన ఆవేదన చెప్పుకుంది. స్పందించిన సీఐ పెద్ద కొడుకు పెద్దిరాజంను  పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లి గంగు బాగోగులు చూసుకోవాలని సూచించారు.