OLX కార్లే టార్గెట్ : టెస్ట్ డ్రైవ్ చేస్తూ చెక్కేస్తాడు

OLX కార్లే టార్గెట్ : టెస్ట్ డ్రైవ్ చేస్తూ చెక్కేస్తాడు

ఈజీగా డబ్బులు సంపాదించాలని కక్కుర్తిపడ్డ ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. OLXలో అమ్మకానికి పెట్టిన వాహనాలను కొనుగోలు చేస్తాం అంటూ వారిని ఆశ్రయించి, ట్రైల్ చూస్తాను అంటూ కార్లతో ఉడాయిస్తాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టుబడిన నిందితుడి వద్ద నుంచి ఓ కారు, రెండు బైకుల తో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి శనివారం శంషాబాద్ డీసీపి ప్రకాష్ రెడ్డి కేసు వివరాలను మీడియాకు వివరించారు.

మహబూబ్ నగర్ జిల్లా లోని నవాబ్ పేట్ మండలానికి చెందిన నాగేష్ అనే వ్యక్తి గతంలో రాయదుర్గం పిస్ పరిధిలో OLXలో అమ్మకానికి పెట్టిన వాహనాలను కొనుగోలు చేస్తాం అంటూ వారిని ఆశ్రయించి, ట్రైల్ చూస్తాను అంటూ అటు నుంచి అటే పరారయ్యాడు. ఇలా అలవాటు పడ్డ నాగేష్… షాద్  నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ వెళ్లడానికై  క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే  షాద్ నగర్ నుంచి కొద్ది దూరం వెళ్ళాక హోటల్ ముందు ఆపి, సిగరెట్ తీసుకురావాలని క్యాబ్ డ్రైవర్ చెప్పడంతో ..డ్రైవర్ సిగరెట్ తీసుకురావడానికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించి కారుతో ఉడాయించాడు.

ఈ మేరకు  డ్రైవర్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా..  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  క్యాబ్ నెంబరు ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి ఓ కారు, రెండు బైకులతో పాటు..  రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. అయితే OLX లో వాహనాలను అమ్మకానికి పెట్టేముందు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు అనే పూర్తి ఆధారాలు తీసుకోవాలంటూ శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి  ప్రజలకు సూచించారు.