సౌత్ ఆఫ్రికాలో తగ్గిన ఒమిక్రాన్ కేసులు

సౌత్ ఆఫ్రికాలో తగ్గిన ఒమిక్రాన్ కేసులు

జోహెన్నెస్ బర్గ్:  సౌత్ ఆఫ్రికాలో గత కొన్ని రోజులుగా ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మొదట ఆ దేశంలోనే బయటపడిన ఒమిక్రాన్.. నెల రోజుల్లోనే తగ్గుముఖం పట్టిందని, బహుశా ఇది పీక్ స్టేజీని దాటి ఉంటుందని హెల్త్ ఎక్స్ పర్టులు అంచనా వేస్తున్నారు. టెస్టులు తగ్గడం, లెక్కలు ఆలస్యంగా తేలడం, ఇతర కారణాల వల్ల కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నా.. ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిన తర్వాత..  ఒక్కసారిగా తగ్గిపోతున్నట్లు కన్పిస్తోందని నిపుణులు చెప్తున్నారు. పోయిన గురువారం సౌత్ ఆఫ్రికాలో 27 వేల డైలీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మంగళవారం నాటికి 15,424కు తగ్గాయి. దేశంలో ఒమిక్రాన్ భారీగా వ్యాపించిన గ్వాటెంగ్ ప్రావిన్స్, జోహెన్నెస్ బర్గ్, ప్రిటోరియా సిటీల్లో కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. గ్వాటెంగ్ ప్రావిన్స్ లో నవంబర్ మధ్య నుంచి నమోదైన కరోనా కేసుల్లో 90 శాతం కేసులు ఒమిక్రాన్ వే ఉన్నాయి. ప్రావిన్స్ లో ఈ నెల 12న 16 వేల డైలీ కేసులు నమోదు కాగా, మంగళవారం నాటికి కొత్త కేసులు క్రమంగా 3,300కు తగ్గాయి. మొదటి నుంచీ ఒమిక్రాన్ కేసులకు ఎపిసెంటర్ గా ఉన్న ఈ ప్రావిన్స్ లోనే కేసులు ఇంత భారీగా తగ్గడం చూస్తుంటే.. కొత్త వేరియంట్ భారీ స్థాయిలో వ్యాపించినా, త్వరలోనే పీక్ స్టేజీని దాటుతున్నట్లు తెలుస్తోందని డాక్టర్లు చెప్తున్నారు.