ఢిల్లీలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : దేశ రాజధానిలో ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఢిల్లీలో తాజాగా మరో నాలుగు కొత్త వేరియెంట్ కేసులు నమోదయ్యాయి.  వీటితో కలుపుకొని ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. ఒమిక్రాన్ బారిన పడిన 10 మందిలో ఒకరిని డిశ్చార్జ్ చేశామని, మిగిలిన 9 మందికి ఎల్ఎన్జేపీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వారిలో ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని, అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు.

ఒమిక్రాన్ సోకినట్లు భావిస్తున్న 40 మందిని లోక్ నాయక్ హాస్పిటల్ లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు సత్యేంద్ర జైన్ చెప్పారు. విదేశాల నుంచి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్న ప్రయాణికుల్లో చాలా మంది కరోనా పాజిటివ్ గా తేలుతున్నారని ఆయన అన్నారు. ఒక్క గురువారం నాడే ఇలా విదేశాల నుంచి వచ్చిన 8 మందికి పాజిటివ్ వచ్చిందని, వారందరినీ హాస్పిటల్ కు తరలించి ఐసోలేషన్ లో ఉంచినట్లు సత్యేంద్రజైన్ చెప్పారు. కేసుల సంఖ్య పెరగకుండా ఢిల్లీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.