ప్రపంచ దేశాలను వెంటాడుతున్న ఒమిక్రాన్

ప్రపంచ దేశాలను వెంటాడుతున్న ఒమిక్రాన్

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. సౌతాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియెంట్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం దేశ రాజధానిలో మరో 10 మంది, తెలంగాణలో ఇద్దరు ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. తాజాగా వెలుగులోకి వచ్చిన కేసులతో కలుపుకుని దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 95కు చేరింది. యూకే నుంచి గోవాకు వచ్చిన ముగ్గురు ప్యాసింజర్లకు కోవిడ్ పాజిటివ్ రాగా.. వారి శాంపిల్స్ ను  జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో గురువారం 279 మందిని కోవిడ్ పాజిటివ్ గా గుర్తించారు. నవంబర్ 11 తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. 

  • ఒమిక్రాన్ వేరియెంట్ ఇప్పటి వరకు 77 దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాలో వైరస్ పెను ప్రభావం చూపుతోంది. 
  • అమెరికాపై కరోనా మళ్లీ పంజా విసురుతోంది. గురువారం ఒక్క న్యూయార్క్ స్టేట్ లోనే 18, 276 కేసులు రికార్డయ్యాయి. జనవరి తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. న్యూయార్క్ సిటీలో వారం రోజులుగా సగటున 2,899 కేసులు నమోదవుతున్నట్లు న్యూయార్క్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది.
  • ఒమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో యూకేలోనూ వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ లో కొత్తగా 88,376 మంది వైరస్ బారిన పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హాస్పిటళ్లలో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 
  • ఆస్ట్రేలియాలో శుక్రవారం 2,213 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి ఇంత భారీ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. న్యూ సౌత్ వేల్స్ లో 1,742 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం 215 మంది వివిధ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా.. ఒకరు మృతి చెందారు.
  • ఒమిక్రాన్ వేరియెంట్ తొలిసారి బయటపడిన సౌతాఫ్రికాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 26,976 మంది ఒమ్రికాన్ బారిన పడ్డారు. 620 మంది హాస్పిటల్ లో ఉండగా.. కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు 54 మంది చనిపోయినట్లు ఎన్ఐసీడీ ప్రకటించింది.