కరోనా కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైన పలు రాష్ట్రాలు

V6 Velugu Posted on Nov 27, 2021

దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వేరియంట్ వ్యాప్తి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోడీ ఇవాళ నిర్వహించిన రివ్యూలో సూచించారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రత్తమై జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.సెకండ్ వేవ్ లో భారీగా దెబ్బతిన్న మహారాష్ట్ర ముందే ఆంక్షలు ప్రకటించింది. ఇతర దేశాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చేవారిని కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం డీల్ చేస్తామని తెలిపింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న సర్టిఫికెట్ లేదంటే.. 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని తేల్చి చెప్పింది. క్యాబ్ లు, బస్ లలో కరోనా గైడ్ లైన్స్ ఫాలో కానివారికి 500 రూపాయలు ఫైన్ వేస్తామని వార్నింగ్ ఇచ్చింది. డ్రైవర్, కండక్టర్, హెల్పర్, క్యాబ్ ఓనర్లకు కూడా ఫైన్స్ ఉంటాయని స్పష్టం చేసింది. ఇక సొంత వాహనాల్లోనూ గైడ్ లైన్స్ పాలో కాకపొతే... 1000 రూపాయల ఫైన్ వేస్తామంది హెచ్చరించింది మరాఠా సర్కార్. మరోవైపు సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ ముంబై ఎయిర్‌‌పోర్టులో టెస్టులు చేసి, క్వారంటైన్‌కు పంపాలని నిర్ణయించినట్లు బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌‌ కిశోరీ పండేకర్ ప్రకటించారు. వారి నుంచి సేకరించిన శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని ఆదేశించారు.

తెలంగాణ, ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలు కూడా..

ఢిల్లీలోనూ ఆంక్షలు తీవ్రం చేయాలని చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్ లను ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు.  హాస్పిటల్స్‌ను పూర్తి సన్నద్ధంగా ఉంచాలని సూచించారు. ఇక గుజరాత్ ప్రభుత్వం కూడా కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఎయిర్‌‌పోర్టులన్నింటినీ అలర్ట్ చేసింది. యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, హాంగ్‌కాంగ్ దేశాల నుంచి వచ్చే వాళ్లకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ సర్కారు కూడా కొత్త వేరియంట్‌ అడ్డుకునేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రేపు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ సమావేశం తర్వాత ఎటువంటి ఆంక్షలు పెట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tagged Telangana, Delhi, Maharashtra, Corona Restrictions, Omicron variant, corona new variant effect

Latest Videos

Subscribe Now

More News