తల్లికి పాటతో వీడ్కోలు.. కంటతడి పెట్టిస్తున్న డాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌

తల్లికి పాటతో వీడ్కోలు.. కంటతడి పెట్టిస్తున్న డాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఆస్పత్రిలో ఆఖరు క్షణాలలో ఉన్న తల్లికి ఫోన్లో పాట పాడి వినిపించాడో కొడుకు.. కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ తల్లికి గుడ్​ బై చెప్పి చివర్లో భోరుమన్నాడు. ఆ తల్లీ కొడుకుల చివరి ఫోన్​కాల్ ​ఆస్పత్రి సిబ్బందిని కంటతడి పెట్టించింది. ఆ ఫోన్​ కాల్​ చేసిన డాక్టర్​ ఈ సంఘటనను వివరిస్తూ చేసిన ట్వీట్​చదివిన వాళ్లంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఈ విషాదం చోటుచేసుకుంది. సిటీకి చెందిన డాక్టర్​ దీప్షికా ఘోష్​ కరోనా వార్డ్​లో డ్యూటీ చేస్తున్నారు. ఈ నెల 12న  సంఘమిత్ర చటర్జీ అనే పేషెంట్​ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇక బతికే అవకాశంలేదని అర్థంకావడంతో డాక్టర్​ దీప్షిక పేషెంట్​ను పలకరించారు. ఒకసారి తన కొడుకు సోహమ్​ చటర్జీని చూడాలని కోరడంతో.. దీప్షిక తన ఫోన్​ నుంచి ఆయనకు వీడియో కాల్​ చేశారు. కొడుకును కళ్లారా చూసుకుంది. తల్లి పరిస్థితి చూసి సోహమ్​ తట్టుకోలేకపోయాడు. గుండెల్లోంచి తన్నుకొస్తున్న బాధను, కన్నీటిని దిగమింగి తల్లికోసం ఓ పాట పాడాడు. స్వతహాగా సింగర్​ కావడంతో తల్లికి పాటపాడుతూ తుది వీడ్కోలు పలికాడు. పాట మధ్యలో కన్నీరు ఆపుకోలేక భోరుమన్నాడు. తర్వాత తేరుకొని పాట పూర్తిచేశాడు. సోహమ్​ పాట తననే కాదు.. వార్డులోని ఇతర డాక్టర్లు, నర్సులను కంటతడి పెట్టించిందని, అందరూ సంఘమిత్ర బెడ్​ దగ్గరికి చేరి సైలెన్స్​గా నిలుచున్నారని డాక్టర్​ దీప్షిక చెప్పారు.