ఆర్మీ ఆయుధాలన్నీ భారత్లోనే తయారీ

ఆర్మీ ఆయుధాలన్నీ భారత్లోనే తయారీ

న్యూఢిల్లీ: భారత సెక్యూరిటీ ఫోర్సెస్ కు అవసరమైన ప్రతి ఆయుధాన్ని స్వదేశంలోనే తయారు చేసుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ విషయాన్ని మిలిటరీ ఎక్విప్ మెంట్స్ అందించడంలో ఎన్నో ఏళ్లుగా భాగస్వాములుగా ఉన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లకు తెలియజేశామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) వార్షిక సమావేశంలో రాజ్ నాథ్ పైవ్యాఖ్యలు చేశారు. 

‘భారతదేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని మన సెక్యూరిటీ ఫోర్సెస్ కు కావాల్సిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వదేశంలోనే తయారు చేసకుంటామని మిత్ర దేశాలకు తెలియజేశాం. యూఎస్, రష్యా, ఫ్రాన్స్ తోపాటు ఇతర దేశాలకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాం. యుద్ధ పరికరాలు, ఇతర ఆయుధాల ప్రొడక్షన్ ను భారత్ లోనే చేపట్టాలని వారిని కోరాం. మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ నినాదంతో ముందుకెళ్దామని చెబుతున్నాం. ఆయా దేశాల నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం’ అని రాజ్ నాథ్ అన్నారు. ప్రస్తుతం దేశ డిఫెన్స్, ఏరోస్పేస్ మానుఫాక్చరింగ్ మార్కెట్ విలువ రూ.85 వేల కోట్లుగా ఉందని.. 2022కు ఇది లక్ష కోట్లకు చేరుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.