23న మోడీకి బై బై: రాహుల్ గాంధీ

23న మోడీకి బై బై: రాహుల్ గాంధీ
  • ఐదేళ్ల బీజేపీ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
  • అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం
  • ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

పేదల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తానన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఉల్టా వాళ్ల జేబుల్లో డబ్బుల్లేకుండా చేశారని ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఐదేళ్లలో మోడీ చేసిన వాగ్ధానాలు, వైఫల్యాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని..మే23న ఆయనకు బై బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ‘ప్రచార సభల్లో అవినీతి కుంభకోణాలపై మాట్లాడకుండా మోడీ దాటవేశారు. కానీ, ఆయనను తప్పించుకునేందుకు వీళ్లేకుండా చేశాం’ అని రాహుల్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇంజిన్​లోంచి ఫ్యూయెల్ మొత్తం తోడేసిన మోడీ.. ఇంజిన్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే.. న్యాయ్​స్కీం ద్వారా దాన్ని రీఫ్యూయెల్ చేస్తామన్నారు.

గురువారం యూపీలోని ఖుషీనగర్, బీహార్​లోని బిక్రమ్​లలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ప్రధాని మోడీ డీమానిటైజేషన్, జీఎస్టీతో సామాన్యుల నడ్డి విరిచారని మండిపడ్డారు. పేదల నుంచి మోడీ దోచుకున్నది.. తిరిగి రప్పించాలని కోరుకుంటున్నామన్నారు. రైతు బీమా అంటే ఓ 20మంది ఇండస్ట్రియలిస్టులు, కేపిటలిస్టులకు బెనిఫిట్ కల్పించడమేనని ఆయన ఉద్దేశమని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే న్యాయ్​ ద్వారా దేశంలోని ప్రతి నిరుపేద వ్యక్తికి నెలకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.72 వేలు లభిస్తుందన్నారు. లక్షలాది మంది యువతకు ఫ్యాక్టరీలు, దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఏటా రైతులకోసం ప్రత్యేక బడ్జెట్​ప్రవేశపెడతామన్నారు.