- భక్తుల ఆనందపరవశం
భద్రాచలం, వెలుగు : వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం భద్రాద్రి రామయ్య వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తొలుత స్వామికి, రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం చేసి, గర్భగుడిలో సీతారామచంద్రస్వామి మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడా మండపానికి సీతారాముల ఉత్సవమూర్తులను తీసుకొచ్చి వామనరూపంలో అలంకరించారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత వేదవిన్నపాలు జరిగాయి.
నాళాయర దివ్య ప్రబంధం పారాయణం అయ్యాక స్వామిని ఊరేగింపుగా మిథిలాస్టేడియంకు తీసుకొచ్చారు. భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవను నిర్వహించారు. కాగా ధనుర్మాసోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆండాళ్లమ్మ వారి తిరుప్పావై సేవాకాలం జరిగింది. గర్భగుడిలో స్వామి వారికి తిరుప్పావై పాశురం విన్నవించారు. ఉదయం ఆండాళ్లమ్మకు తిరువీధి సేవ నిర్వహించారు.
కన్నుల పండువగా శోభాయాత్ర
అంతకుముందు వామనరాముడిని శోభాయాత్రగా మిథిలాస్టేడియం ప్రాంగణంలోని వేదికపైకి తీసుకొచ్చారు. మహిళల కోలాటాలు, దేవతల వేషాల్లో ప్రదర్శనలు, భక్తుల రామనామ స్మరణలు, బాణాసంచాల కాల్పులతో వేడుకగా ఈ యాత్ర సాగింది. కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్టుల ఆధ్వర్యంలో పగల్‌పత్ ఉత్సవం, శోభాయాత్ర జరిగింది. భక్తుల భాగస్వామ్యంలో జరిగే ఈ వేడుకలో ఈవో దామోదర్‌రావు, ఏఈవో శ్రావణ్‌కుమార్‌లు పాల్గొని అవసరమైన సదుపాయాలు కల్పించారు. వామనరాముడిని దర్శించుకునే భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మిథిలాప్రాంగణం వేదిక నుంచి మాడవీధుల గుండా జరిగిన తిరువీధి సేవలో వామనరామునికి పూలతో స్వాగతం పలికారు. దారిపొడవునా భక్తుల జయజయధ్వానాలు మారుమ్రోగాయి.
రాముని సన్నిధిలో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్
భద్రాచలం సీతారామచంద్రస్వామిని ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అర్జున్ అవార్డు గ్రహీత రంకిరెడ్డి సాత్విక్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆయన ఆలయంలో పూజలు చేసిన అనంతరం వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.
