ఇండియా, అమెరికా కలిసి పనిచేస్తాయి: రక్షణ మంత్రి రాజ్‌‌‌‌నాథ్ సింగ్

ఇండియా, అమెరికా కలిసి పనిచేస్తాయి: రక్షణ మంత్రి రాజ్‌‌‌‌నాథ్ సింగ్

వాషింగ్టన్: ఇండియా, అమెరికా పలు అంశాల్లో కలిసి పనిచేయాలనుకుంటున్నాయని, ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందేందుకు ఎదురుచూస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌‌‌‌నాథ్ సింగ్ అన్నారు. ఇండియా, యూఎస్​ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి రాజ్​నాథ్ 4 రోజుల పర్యటన కోసం యూఎస్​వచ్చారు. ఆదివారం ఆయన మేరిలాండ్​ రాష్ట్రంలోని కార్డెరాక్ నేవల్ సర్ఫేస్ వార్‌‌‌‌ఫేర్ సెంటర్‌‌‌‌ను సందర్శించారు. అంతకు ముందు ఆయన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌‌‌‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్​తో భేటీ అయ్యారు. 

మీటింగ్ తర్వాత రాజ్​నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇండియా, యూఎస్ మధ్య పెరుగుతున్న సహకారం అన్ని రంగాలను కవర్ చేస్తుందని చెప్పారు. అలాగే రెండు దేశాల -ప్రజల మధ్య దృఢమైన సంబంధాలు, ప్రజాస్వామ్య విలువలను పంచుకోవడం, అనేక సమస్యలపై యూఎస్, ఇండియా కామన్ ఇంట్రెస్టులను గుర్తించినట్టు వెల్లడించారు. ఆస్టిన్ మాట్లాడుతూ.. క్రిటికల్ సప్లై చైన్​ను బలోపేతం, డిఫెన్స్ సంబంధ అంశాల్లో సహకారం పెంపు ఉంటుందన్నారు. 

‘‘స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ అనేది తమ విజన్​ అని..  ఇరు దేశాల మిలటరీ మధ్య సహకారం మరింత బలంగా వృద్ధి చెందుతుంది” అని అన్నారు. అలాగే, డిఫెన్స్, పారిశ్రామిక సంబంధాలను విస్తరిస్తున్నామని చెప్పారు. రెండు దేశాలు అన్ని డొమైన్‌‌‌‌లలో కార్యాచరణ సహకారాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఇండియన్ నేవి భద్రత కల్పించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుందని ఆస్టిన్ అన్నారు.