ఎన్నికల వేళ కళాకారులకు ఫుల్ డిమాండ్

ఎన్నికల వేళ కళాకారులకు ఫుల్ డిమాండ్
  • ఎన్నికల వేళ..కళాకారులకు ఫుల్ డిమాండ్
  • ఏ పార్టీ ప్రచార సభల్లో చూసిన వారే
  • ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు 
  • గ్రూప్​లతో అగ్రిమెంట్​చేసుకుంటున్న నేతలు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో కళాకారులు లేని రాజకీయ సభలు ఉండవు. వాళ్లే ఆ సభలకు స్పెషల్ అట్రాక్షన్. ఆటలు, పాటలు, డప్పుల దరువు, డోలు మోతలతో సభలకు వచ్చినవారిని ఉత్తేజపరుస్తారు. మాటలతో చెప్పినదానికంటే.. పాటతో చెప్పితే ప్రజలకు తొందరగా రీచ్ అవుతుంది. అందుకే రాజకీయ నాయకులు తమ హామీలను, స్కీములను, పార్టీల మేనిఫెస్టోలను స్టేజీలపై పాటల రూపంలో పాడిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉండడంతో ఎన్నికల వేళ కళాకారులకు డిమాండ్ ఏర్పడింది. ప్రచారం ముగిసేదాకా తమతో ఉండాలని అడ్వాన్స్​లు ఇచ్చి కళాకారుల గ్రూపులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నరు.

కళాకారులు బిజీ బిజీ..

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో రాష్ట్రంలోని కళాకారులు బిజీ అయిపోయారు. జానపద గాయకులు, డ్యాన్సర్లు, ఆర్కెస్ట్రా టీమ్స్, డప్పు కళాకారులు, మహిళా డప్పు కళాకారులు, కోలాటాలు ఆడే మహిళలు, ఒగ్గుకథ, ఒగ్గుడోలు గుస్సాడి నృత్యాలు చేసేవారు గ్రూపులుగా ఏర్పడి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రచారానికి వెళ్తున్నారు. అభ్యర్థులు, మేనిఫెస్టోల మీద పాటలు రాసి జనాలకు అర్థమయ్యేలా పాడుతున్నారు. సభల్లో ముఖ్య అతిథులు వచ్చేంత వరకు ప్రజలకు బోర్ కొట్టకుండా.. ఆట పాటలతో అలరిస్తారు. డప్పు, కోలాటం కళాకారులు అతిథులకు తమ ఆటలతో స్వాగతం పలుకుతారు.

ఎవరికెంతంటే..

ఎలక్షన్ సీజన్ కావడంతో కళాకారులకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు ఖర్చు ఎక్కువైనా కూడా అభ్యర్థులు వెనకాడటం లేదు. గాయకులు, ఆర్కెస్ట్రా గ్రూప్‌నకు రోజుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా ఇస్తుండగా, డప్పు కళాకారుల బృందానికి రూ.20 వేల దాకా, కోలాటం ఆడే మహిళలకు రూ.15 వేలు చెల్లిస్తున్నారు. ఒగ్గు, గుస్సాడి నృత్యాల బృందాలకు రూ.20 వేల దాకా చెల్లిస్తున్నారు. కళాకారులకు భోజన, వసతి సౌకర్యాలు అభ్యర్థులే కల్పిస్తున్నారు. సభ నిర్వహించబోయే ప్రాంతంలో ముందుగానే వారికి లాడ్జీ, హోటళ్లు బుక్ చేస్తుంటారు. కొందరు అభ్యర్థులు ఎన్నికలు ప్రచార గడువు ముగిసే వరకు గ్రూప్​తో అగ్రిమెంట్లు చేసుకుటున్నారు. మరికొందరు అవసరాన్ని బట్టి పిలుస్తున్నారు. నాయకులు బాగానే చెల్లిస్తున్నప్పటికీ మధ్యలో ఉండే దళారులు ఇందులో సగానికి పైగా దోచుకుంటున్నారని కళాకారులు వాపోతున్నారు. 

ఎన్నికల వరకే డిమాండ్.. తర్వాత కూలి పనే

ఎన్నికల వరకే కళాకారులకు ఈ డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు. ఎప్పుడో ఒకసారి ప్రోగ్రామ్‌లు ఉంటాయి. వాటికోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఎన్నికలు ముగిసి ఊరెళ్లాక కూలిపనికి వెళ్లాల్సిందే. పాటలను నమ్ముకొని బతుకుతున్న మాకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. తెలంగాణ ఉద్యమ కళాకారులకు టీఎస్ఎస్​లో స్థానం కల్పించాలి. 

‑ గజవెల్లి ప్రతాప్, సింగర్, జనగామ, తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రజలకు తొందరగా రీచ్​ అవుతుంది

మాటల కంటే పాటలే ప్రజలకు తొందరగా రీచ్ అవుతాయి. అందుకే ప్రచారంలో అభ్యర్థులు మాచేత పాటల రూపంలో పథకాలు, హామీలను పాడిస్తుంటారు. కానీ వాళ్లు గెలిచిన తర్వాత మా సమస్యలను పట్టించుకోరు. ఎన్నికల తర్వాత ఉపాధి కోసం మేము ఎదురుచూడాల్సిన పరిస్థితి. పాటే మా పని. పాటను వదులుకోలేము. వేరే పని చేయలేము. కళాకారులందరిని ప్రభుత్వం ఆదుకోవాలి.

‑ రజిత పెద్దమాతరి, సింగర్, సిద్దిపేట

కళాబంధు ప్రవేశపెట్టాలి

ఉద్యమ కళాకారులు పొట్టకూటి కోసం పార్టీల ప్రచారాలలో పాల్గొనాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కళాకారుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దళితబంధు, బీసీ బంధులా కళాకారుల కోసం కళాబంధు పథకం ప్రవేశపెట్టాలి. టీఎస్ఎస్​లో మరో రెండు వేల మందికి అవకాశం కల్పించాలి. టూరిజం, సాంస్కృతిక శాఖలో కళాకారులను నియమించుకోవాలి.

‑ అందె భాస్కర్, డప్పు కళాకారుడు,  అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్