హోలీ రోజు డిష్యుం డిష్యుం

హోలీ రోజు డిష్యుం డిష్యుం
  •     మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో వింత ఆచారం
  •     రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు

శివ్వంపేట/బోధన్, వెలుగు : హోలీ అంటే.. కామన్​గా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్​పల్లిలో మాత్రం హోలీ పండుగొస్తే చాలు.. పిడిగుద్దులాట నిర్వహిస్తారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతున్నది. ఈ క్రమంలో సోమవారం కొంతాన్​పల్లిలో పిడిగుద్దులాట ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం.. చాకలి, మంగలి, కుమ్మరి, బైండ్ల, గౌడ తదితర కుల వృత్తుల వారు గ్రామ పంచాయతీ వద్ద నుంచి డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి కల్లు ఘటం తీసుకొచ్చి గ్రామ కూడలిలో పెట్టారు. 

ఆ తర్వాత పొడవైన తాడు తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఆలయంలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా కుల వృత్తుల వారు రెండు గ్రూపులుగా విడిపోయి చెరోవైపు తాడు పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దెబ్బలు తగులుతున్నా.. నొప్పి పెడ్తున్నా.. రక్తం వస్తున్నా.. లెక్క చేయకుండా ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించారు. సుమారు రెండు గంటల పాటు ఈ ఆట జోరుగా సాగింది. దీన్ని చూసేందుకు శివ్వంపేట, తూప్రాన్, నర్సాపూర్, వెల్దుర్తి మండల పరిధిలోని గ్రామాలతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

నిజామాబాద్ జిల్లాలోనూ పిడిగుద్దులాట

నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా గ్రామంలో కూడా పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. హోలీ సందర్భంగా సోమవారం ఉదయం రంగులు చల్లుకున్న తర్వాత సాయంత్రం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద పిడిగుద్దులాట నిర్వహించారు. ముందుగా.. గ్రామ దేవతలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దలను డప్పు వాయిద్యాలతో చావిడి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడే రెండు వైపులా బలమైన కట్టెలు పాతి వాటి మధ్య తాడు కట్టారు. తర్వాత గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. 

తాడును మధ్యలో పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. ఇలా 15 నుంచి 30 నిమిషాల పాటు ఈ ఆట కొనసాగింది. తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పిడిగుద్దులాట నిర్వహించకపోతే గ్రామానికే అరిష్టమని స్థానికులు తెలిపారు. ఆటలో ఎవరికైనా దెబ్బలు తగిలితే.. కామదహనంలోని బూడిదను వాటిపై పూసుకుంటామని చెప్పారు.