భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో..

భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో..
  •  టీచర్ ను చంపేసి చెరువులో పడేసిన్రు
  • 26 రోజుల తర్వాత హైదరాబాద్ లో దొరికిన డెడ్ బాడీ
  • మూడు రోజుల కింద సూసైడ్  చేసుకున్న నిందితుడి భార్య 
  • ముగ్గురు నిందితులను అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు

మెదక్, రామాయంపేట, వెలుగు: తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో సదరు మహిళ భర్త మరో ఇద్దరితో కలిసి ఓ ప్రభుత్వ టీచర్ ను హత్యచేసి డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకెళ్లి చెరువులో పడేశాడు. మొదట్లో టీచర్ మిస్సింగ్ అయినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు. రామాయంపేట సీఐ వెంకటేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్  పట్టణంలోని వినాయక నగర్ కు చెందిన మోత్కూరు నాగరాజు(53) మెదక్  జిల్లా మాసాయిపేట జడ్పీ హైస్కూల్ లో హిందీ పండిత్ గా పని చేస్తున్నాడు.

 చేగుంట పట్టణంలో ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. అదే ఇంట్లో అద్దెకు ఉండే వంగా సత్యనారాయణ తన భార్య వంగా స్వాతి అలియాస్​ మాధవితో టీచర్​కు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్  కేపీహెచ్ బీ ఎల్లమ్మబండకు చెందిన తన బావమరిది వర్కల మల్లేశ్, మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలం జవహర్ నగర్ కు చెందిన అతని ఫ్రెండ్  సునీల్ గౌడ్ తో కలిసి పథకం ప్రకారం గత నెల 28న నాగరాజును అతను అద్దెకు ఉండే ఇంట్లోనే హత్య చేశారు. 

మరుసటి రోజు మల్లేశ్, సునీల్ గౌడ్ తో కలిసి నాగరాజు డెడ్ బాడీని ఓ మూటలో కట్టి  అద్దె కారులో హైదరాబాద్ శివారులోని ప్రగతినగర్  చెరువులో పడేశారు. మూడు రోజులుగా నాగరాజు మాట్లాడక పోవడంతో అతని కొడుకు వంశీధర్​ చేగుంటకు వచ్చి ఆచూకీ లేక పోవడంతో మార్చి 1న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా వంగా సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా, తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో మల్లేశ్, సునీల్ గౌడ్ తో కలిసి నాగరాజును హత్యచేసి డెడ్ బాడీని చెరువులో పడేసినట్లు అంగీకరించారు. ఇదిలాఉంటే టీచర్ నాగరాజు హత్య కేసులో నిందితుడైన వంగా సత్యనారాయణ భార్య వంగా స్వాతి అలియాస్ మాధవి మూడు రోజుల కింద సూసైడ్​ చేసుకుంది.