నందకుమార్, ప్రతాప్ మధ్య జరిగిన లావాదేవీలపై సిట్ ఆరా

నందకుమార్, ప్రతాప్ మధ్య జరిగిన లావాదేవీలపై సిట్ ఆరా

ఫాంహౌస్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు అడ్వకేట్ ప్రతాప్. నిందితుడు నందకుమార్, ప్రతాప్ మధ్య జరిగిన లావాదేవీలపై విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి నందకుమార్ భార్య చిత్రలేఖను మరోసారి ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇక ఫాంహౌస్ ఎమ్మెల్యేల కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్ ను రిజెక్ట్ చేస్తూ.. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.

ఈ కేసులో నిందితుడైన నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన లాయర్ ప్రతాప్ గౌడ్ ను అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. ఇద్దరిని వేర్వేరుగా 8 గంటల పాటు విచారించారు. ప్రధానంగా ఫిల్మ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని నందకుమార్‌‌‌‌‌‌‌‌కు చెందిన డెక్కన్‌‌‌‌ కిచెన్‌‌‌‌లో జరిగిన మీటింగ్స్‌‌‌‌పై ఆరా తీసినట్లు తెలిసింది. గతంలో రామచంద్రభారతి ఇక్కడే షెల్టర్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్లు సిట్ అనుమానిస్తోంది. 

ఈ క్రమంలోనే సీసీ కెమెరా ఫుటేజీ, ఫొటోల ఆధారంగా చిత్రలేఖను విచారించినట్లు తెలిసింది. అక్కడికి రామచంద్రభారతి, సింహయాజీతో పాటు ఇంకెవరు వచ్చారు? నందకుమార్‌‌‌‌‌‌‌‌తో లాయర్లు శ్రీనివాస్‌‌‌‌, ప్రతాప్‌‌‌‌గౌడ్‌‌‌‌కు ఎంతకాలంగా పరిచయం ఉంది? వీరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి? వంటి విషయాల గురించిన వివరాలు సేకరించినట్లు సమాచారం. అయితే సిట్‌‌‌‌ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు చిత్రలేఖ జవాబు చెప్పలేకపోయారని తెలిసింది. అలాగే నందకుమార్ తో పరిచయం, రామచంద్ర భారతి, సింహయాజీలతో కలిసి దిగిన ఫొటోలపై  కూడా ప్రతాప్ గౌడ్​​ను సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌‌‌‌లో ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులకు డిసెంబర్ 9 వరకు రిమాండ్‌‌‌‌ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‌‌‌‌‌‌‌‌