
న్యూఢిల్లీ: తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ట్రైనింగ్ పొందుతుండగా ఒక ఆర్మీ జవాను అమరుడయ్యాడు. మరికొంత మంది సైనికులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన శనివారం నాడు పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సమీపంలో జరిగింది. ఇక్కడి ముమూన్ మిటలరీ స్టేషన్‌లో కొంత మంది సైనికులకు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఆపరేషన్స్ నిర్వహించడంపై సూపర్‌వైజ్డ్ శిక్షణ కార్యక్రమాన్ని ఇండియన్ ఆర్మీ 9 కార్ప్స్ బెటాలియన్ ఏర్పాటు చేసింది. ఈ ట్రైనింగ్ నడుస్తుండగా కొంత మంది జవాన్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ట్రైనింగ్ సమయంలో అస్వస్థతకు గురైన వారందరినీ పఠాన్‌కోట్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించామన్నారు. అయితే అందులో ఒక జవాన్ మరణించగా, మిగిలిన వారికి ట్రీట్‌మెంట్ కొనసాగుతోందని చెప్పారు.