
భవనంకు ఆనుకుని ఉన్న కరెంట్ వైర్లు
ఆడుతూ కరెంట్ వైర్లు పట్టుకున్న చిన్నారి ఆడపిల్లలు
తొమ్మిదేళ్ల పాప దారుణ మృతి
మరో చిన్నారికి గాయాలు..
ఘోరం… దారుణం.. అమానుషం.. ఇలాంటి పదాలేవీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పలేవు. బిల్డింగ్ పై సరదాగా ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటున్న టైమ్ లో.. అక్కడున్న హైటెన్షన్ వైర్లు.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపాయి. అక్కాచెల్లెళ్లలకు బిల్డింగ్ పై ఉన్న కరెంట్ వైర్లు తగిలాయి. అక్క.. అక్కడికక్కడే మృతిచెందింది. చెల్లెలు గాయపడింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పాతబస్తీ కృష్ణారెడ్డి నగర్ కు చెందిన రుక్మిణి(28), నరేందర్(36) లు దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె 9 ఏళ్ల లక్ష్మి, రెండో కూతురు శ్రీనిధి ఇద్దరూ.. బిల్డింగ్ పైన ఆడుకుంటున్న టైమ్ లో.. బిల్డింగ్ కు ఆనుకొని ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలాయి. లక్ష్మి కరెంట్ షాక్ తో చనిపోయింది. శ్రీనిధి గాయాలతో ప్రాణాపాయం తప్పించుకుంది. గాయపడ్డ శ్రీనిధి గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు పైకి వచ్చారు. అప్పటికే లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ.విద్యాసాగర్ రెడ్డి చెప్పారు. ఇళ్లకు ఆనుకుని లేదా.. దగ్గరలో ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించడం.. లేదా వాటికి ప్లాస్టిక్ పైపులు అమర్చడం లాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
“అక్క చచ్చిపోయింది.. ఆ కరెంట్ వైర్లు పట్టుకుంది… నేను అంత దూరంలో ఆడ పడ్డ..” అంటూ ఏడుస్తూ ఆ చిన్నారి చెల్లెలు చెబుతున్న మాటలు విని స్థానికులు కళ్లనీళ్ల పర్యంతమవుతున్నారు.