Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ బర్త్‌డే గిఫ్ట్.. 'కాంత' టీజర్ వచ్చేసింది!

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ బర్త్‌డే గిఫ్ట్..  'కాంత' టీజర్ వచ్చేసింది!

వరుస విజయాలతో ఫుల్ జోరులో ఉన్న  మలయాళం నటుడు దుల్కర్ సల్మార్ మరో ప్రాజెక్టుతో అలరించేందుకు సిద్ధమైయ్యారు. ఆయన పుట్టిన రోజు ( జూలై 28, 2025 )  సందర్భంగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు.  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయన తదుపరి చిత్రం 'కాంత' (Kaantha) టీజర్‌ను సెన్సార్ బోర్డు క్లియర్ చేయడమే కాకుండా, ఈరోజే విడుదల చేశారు.   ఇది కేవలం ఒక సినిమా టీజర్ కాదు, 1950ల నాటి మద్రాసు సినీ స్వర్ణయుగాన్ని, తమిళ సినిమా తొలి సూపర్ స్టార్‌ జీవితాన్ని ఆవిష్కరించే ఒక దృశ్య కావ్యం!

 'కాంత' కథా నేపథ్యం
'కాంత' చిత్రం ఎం.కె. త్యాగరాజ భాగవతార్ (M.K. Thyagaraja Bhagavathar) జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, 1950ల నాటి మద్రాసులో, స్వాతంత్య్రానంతర భారతదేశంలో తమిళ సినిమాకు 'తొలి సూపర్ స్టార్' గా వెలుగొందిన ఒక గాయకుడు, నటుడు.  ఆయన తన గ్రాతంతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. 'కాంత' చిత్రం భాగవతార్‌ సినీరంగ ప్రవేశం, అగ్రతారగా ఆయన ఎదుగుదల, అలాగే వ్యక్తిగత జీవితంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, పోరాటాలను కళ్ళకు కట్టినట్లు చూపించనుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, ఆ లెజెండరీ నటుడి పాత్రలో ఒదిగిపోవడం టీజర్‌లోనే స్పష్టంగా కనిపిస్తోంది.


2 నిమిషాల 14 సెకన్ల నిడివి గల 'కాంత' టీజర్, భాగవతార్ ప్రపంచాన్ని, ఆనాటి వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ 1950ల నాటి సౌత్ ఇండియా గ్లామర్, సినీ వాతావరణం ఉట్టిపడుతోంది. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దర్శకత్వం వహిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ 'ది హంట్ ఫర్ వీరప్పన్' (The Hunt for Veerappan) తో ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఈ 'కాంత' సినిమాతోతో సెల్వమణి దర్శకుడిగా పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆయన దర్శకత్వ ప్రతిభ, చరిత్రను తెరపైకి తీసుకురావడంలో ఉన్న పట్టు టీజర్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

 

రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా.. 
'కాంత' సినిమాను రానా దగ్గుబాటి (Rana Daggubati) నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా (Spirit Media), దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ (Wayfarer Films) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  'కాంత' చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse), సముద్రఖని (Samuthirakani) వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, టీజర్ విడుదలైనప్పటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల దుల్కర్ 'లక్కీ భాస్కర్' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో, 'కాంత' ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవాలని భావిస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన టీజర్ తో 'కాంత' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

►ALSO READ | Nithiin : 'తమ్ముడు' OTT లో రిలీజ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?