
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది. అప్పటి దాకా ఇంట్లోనే ఉన్న యువతి ఉన్నట్టుండి ప్రాణం లేని స్థితిలో కనిపించే సరికి కన్న తల్లిదండ్రుల గుండె బద్ధలయింది. అసలు ఆ యువతికి ఏమైంది..? ఎందుకు చనిపోయింది ? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువతి సొంత తమ్ముడిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో రుచిత అనే యువతి ఈ రోజు (జులై 28, 2025) మధ్యాహ్నం ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించింది. ఆ సమయంలో ఆమె తమ్ముడు తప్ప ఆ యువతి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఇంటికొచ్చి చూసేసరికి.. రుచిత ప్రాణాలతో లేకుండా కనిపించేసరికి ఆమె కన్న తల్లిదండ్రులు కడుపు కోతతో గుండెలవిసేలా రోదించారు. ఆమె సొంత తమ్ముడైన రోహిత్ హత్య చేసి ఉండొచ్చని పోలీసులకు రుచిత కుటుంబం ఫిర్యాదు చేసింది. సొంత తమ్ముడే చంపి ఉంటాడని తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు.
రోహిత్ జల్సాలకు అలవాటు పడి.. చెడు సావాసాలు చేస్తూ ఎప్పుడూ ఇంట్లో వాళ్లతో గొడవ పడుతూ ఉండేవాడు. కన్న తల్లిదండ్రులపై, సొంత అక్కపై ఇష్టమొచ్చినట్టు తిడుతూ గొడవ చేస్తుండేవాడు. రుచిత తల్లిదండ్రులు ఇంట్లో లేని సందర్భంలో రుచితను తిడుతూకొడుతూ రోహిత్ పలుసార్లు అమానుషంగా ప్రవర్తించాడు. రోహిత్ ప్రవర్తన, అతని తీరుతో రుచిత కుటుంబం విసిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుండా పోయింది. రుచితను ఆమె తమ్ముడు రోహిత్ చంపేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ ఇంట్లో కనిపించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.