టీబీతో ప్రతి 21 సెకన్లకు ఓ మరణం

టీబీతో ప్రతి 21 సెకన్లకు ఓ మరణం
  • టీబీతో 15 లక్షల మరణాలు
  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 సెకన్లకు ఓ కేసు.. 21 సెకన్లకు ఓ మరణం
  • వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: టీబీ బారిన పడి గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది మరణించారని వరల్డ్ హెల్త్‌‌ ఆర్గనైజేషన్‌‌ (డబ్ల్యూహెచ్‌‌వో) ప్రకటించింది. ఈ మేరకు గ్లోబల్‌‌ ట్యూబర్‌‌‌‌క్యులోసిస్‌‌ రిపోర్ట్‌‌–2021ను శుక్రవారం విడుదల చేసింది. ప్రపంచంలో ప్రతి 3 సెకన్లకు ఒక టీబీ కేసు, ప్రతి 21 సెకన్లకు ఒక టీబీ డెత్‌‌ నమోదవుతున్నట్టు రిపోర్ట్‌‌లో పేర్కొంది. కరోనాతో టీబీ మరణాలు పెరిగాయని చెప్పింది. ప్రపంచంలో నమోదవుతున్న మొత్తం టీబీ కేసులు, మరణాల్లో మూడో వంతు కేవలం 8 దేశాల్లోనే నమోదవుతున్నట్టు వెల్లడించింది. చైనా, ఇండియా, ఇండోనేషియా, పాకిస్తాన్‌‌, బంగ్లాదేశ్‌‌, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, ఫిలిప్పైన్స్‌‌ దేశాలు ఉన్నాయని తెలిపింది. కరోనాతో ఆయా దేశాల్లో గత ఏడాది టీబీ కేసులు తగ్గినట్టు స్టడీలో పేర్కొంది. అత్యధికంగా ఇండియాలో 41 శాతం కేసులు తగ్గాయని తెలిపింది. మొత్తంగా గత ఏడాది సుమారు కోటి మంది టీబీ బారిన పడినట్టు, ఇందులో 11 లక్షల మంది చిన్న పిల్లలు ఉన్నారని డబ్ల్యూహెచ్‌‌వో ప్రకటించింది. గతంలో కంటే టీబీ ట్రీట్‌‌మెంట్‌‌ మెరుగైందని, గత పదేండ్లలో సుమారు 6.7 కోట్ల మంది టీబీని జయించారని వెల్లడించింది.

ఇండియాలో 18 లక్షల కేసులు
గత ఏడాది మన దేశంలో 18.12 లక్షల మంది టీబీ బారిన పడగా, మన రాష్ట్రంలో 63,338 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో 16.25 లక్షల కేసులు నమోదవగా, మన స్టేట్‌‌లో 45,306 కేసులు గుర్తించారు. దీనికి 30 శాతం అదనంగా కేసులు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. టీబీ రోగుల పట్ల సమాజంలో ఉన్న వివక్ష కారణంగా, వ్యాధి వచ్చిన విషయాన్ని చాలా మంది ఇప్పటికీ దాస్తున్నారని, దీంతో ఏటా 20 నుంచి 30 శాతం కేసులు రిపోర్ట్‌‌ కావడం లేదని రిపోర్ట్‌‌లో పేర్కొంది. మన దేశంలో 2025 నాటికి టీబీని సంపూర్ణంగా నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.