ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల ప్రజలను నిరాశ పర్చారు

జగిత్యాల, వెలుగు: జిల్లాపై సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, బహిరంగ సభలో జగిత్యాల ప్రజలను నిరాశపర్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాల జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తాడని ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూశారని, వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.100 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై పరస్పర చర్చలు ఉండవని, రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుందని, దీనికన్నా నిజాం పాలన మెరుగన్నారు. కొండగట్టు ప్రమాద బాధితులకు కనీసం నివాళులు అర్పించకపోవడం విచారకమన్నారు. ఒడ్డే లింగాపుర్, అల్లిపుర్ మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల నడిబోడ్డున కలెక్టరేట్ కార్యాలయం నిర్మించడం, 40 ఏళ్ల నా ప్రజా జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. జిల్లా సమస్యల్ని సీఎంకు నివేదించండంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారన్నారు. రోల్లవాగు నిర్మాణంలో జాప్యంతో 60 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం 120 కోట్లకు పెరిగిందని జీవన్​రెడ్డి న్నారు.

కార్యకర్త ఇంట్లో చాయ్​ తాగిన ‘బండి’

మల్లాపూర్, వెలుగు: బీజేపీ స్టేట్​చీఫ్ బండి సంజయ్ కార్యకర్త ఇంటికి వెళ్లి చాయ్​ తాగారు.  ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు సంజయ్​గురువారం వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ దళిత కార్యకర్త ధమ రాజేశ్​ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో తేనీటి విందులో పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. 

ఎమ్మెల్యే అండతో అక్రమంగా మట్టి దందా

పెద్దపల్లి, వెలుగు: ఎమ్మెల్యే అండతోనే అక్రమ మట్టి దందా జరుగుతోందని పెద్దపల్లి జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఎస్.సతీశ్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్​ సమీపంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను గురువారం బీజేవైఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కనుసన్నుల్లోనే అక్రమ మట్టి దందా కొనసాగుతోందని ఆరోపించారు. మట్టి తవ్వకాల్లో అస్తి పంజరాలు బయటపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా,  సంబంధిత మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకుని, వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం ప్రధానకార్యదర్శి నాయకులు సందీప్, దూలం సతీశ్, కోనేటి సదయ్య, వేణు, వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధి 

కొండగట్టు,వెలుగు: యాదాద్రి తరహాలో కొండగట్టును అభివృద్ధి చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గురువారం కొడిమ్యాల, మల్యాల మండల నాయకులతో గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ కొండగట్టుకు రూ.100 కోట్లు మంజూరు చేసిన సీఎంకు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. బండి సంజయ్ కు దమ్ముంటే కొండగట్టుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్​విసిరారు. బండి సంజయ్ కు బీజేపీ అధ్యక్ష పదవి కేసీఆర్ వేసిన భిక్ష అని, కేసీఆర్ ను విమర్శించే స్థాయి సంజయ్ కు లేదన్నారు. కార్యక్రమంలో మల్యాల విమల, జడ్పీటీసీ రాంమెహన్ రావు, నాయకులు పాల్గొన్నారు.  

వాహనాలు తనిఖీ చేసిన అడిషనల్​ కలెక్టర్​

జగిత్యాల,వెలుగు: స్థానిక బల్దియా వాహనాలను జగిత్యాల అడిషనల్​కలెక్టర్ గురువారం పరిశీలించారు. మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణకు వినియోగిస్తున్న 67 వెహికల్స్ కండిషన్ ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.

‘అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు’

కోరుట్ల, వెలుగు : సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, రైతులను అరెస్ట్​చేశారని, అరెస్టులతో, నిర్బంధాలతో తమ పోరాటాలను ఆపలేరని టీపీసీసీ లీడర్​ కాటిపెల్లి  శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ షుగర్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని తెరిపిస్తానని బూటకపు హామీలతో  రైతులను మోసం చేశారన్నారు. రాష్ర్ట ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటేశ్​గౌడ్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్, లీడర్లు పాల్గొన్నారు.  

కులాంతర వివాహం చేసుకున్న అల్లుడిపై మామ దాడి, కేసు నమోదు

చందుర్తి, వెలుగు: తన బిడ్డను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడని అల్లుడిపై కత్తితో దాడి చేసిన ఘటన చందుర్తి మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం చందుర్తిలోని దళిత సామాజికవర్గానికి చెందిన చెందిన బత్తుల పురుషోత్తం(30), అదే గ్రామానికి చెందిన లింగంపల్లి సాత్విక(20) రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితమే వారు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల క్రితం ఊర్లోకి వచ్చి జీవిస్తున్నారు. ఇది నచ్చని సాత్విక తండ్రి తిరుపతి పురుషోత్తంపై పగను పెంచుకున్నాడు. ఎలాగైనా అల్లుడిని చంపాలని నిర్ణయించుకొని అతని కదలికలపై నిఘా పెట్టాడు. గురువారం ఊర్లో ఉన్న వాటర్ ప్లాంట్ దగ్గరకు నీళ్ల కోసం వచ్చిన పురుషోత్తంపై  తిరుపతి కత్తితో దాడి చేశాడు. పురుషోత్తం చేతికి తీవ్ర గాయాలు కాగా తప్పించుకొని ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే వేములవాడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. తిరుపతిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ ​తెలిపారు.

ఏడోసారి ప్రభుత్వ ఏర్పాటు చారిత్రాత్మకం

జిల్లాల్లో ఘనంగా లీడర్ల సంబురాలు

కరీంనగర్ టౌన్ , వెలుగు: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణారెడ్డి అన్నారు. పార్టీ భారీ విజయం సాధించడంతో స్థానిక తెలంగాణ చౌక్ లో కృష్ణారెడ్డి పటాకులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీకి గుజరాత్ ప్రజలు పట్టం కట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ జితేందర్, బల్బీర్ సింగ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో పెద్దపల్లి జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ధర్మారం మండల కేంద్రంలో లీడర్లు పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో  నాయకులు కాడే సూర్యనారాయణ, యాళ్ల తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, రాం గోపాల్ రెడ్డి, లక్ష్మణ్, మణికంఠ, మహేందర్ రెడ్డి, చంద్రయ్య, రజనీకాంత్, స్వామి తదితరులు పాల్గొన్నారు. 

గోదావరిఖని: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో గోదావరిఖని చౌరస్తా లో లీడర్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోడీ పాలనను దేశవ్యాప్తంగా ప్రజలు ఆమోదిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మామిడ రాజేశ్, మహావాది రామన్న, పొన్నం శశికుమార్, బూడిద రమేశ్, మామిడి సంపత్, అడ్డూరి రాజేశ్, మచ్చ విశ్వాస్ తదితరులు ఉన్నారు.
ఇల్లందకుంట:గుజరాత్​లో బీజేపీ విజయఢంకా మోగించడంతో గురువారం ఇల్లందకుంట మండల కేంద్రంలో లీడర్లు సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్​, శీలం శ్రీనివాస్​, రమేశ్​, ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇసుక లారీ బోల్తా

మంథని, వెలుగు : మండలంలోని ధర్మారం గ్రామ శివారులోని రైస్ మిల్లు వద్ద గురువారం ఇసుక లారీ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి పక్కనే ఉన్న కాలువలో పడింది. ఆ సమయంలో వేరే వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  

సభ సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు

జగిత్యాల,వెలుగు: జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసినందుకు పార్టీ నాయకులు, ప్రజలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణితో కలిసి నిర్వహించిన సామవేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ గర్జనను విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారన్నారు. సభ సక్సెస్ కావడానికి జిల్లా అధికారుల పాత్ర క్రియాశీలకమైనదని సంజయ్ అన్నారు. 

సరస్వతి ఆలయంలో దంపతుల పూజలు

చొప్పదండి, వెలుగు: పట్టణంలో నూతనంగా నిర్మించిన జ్ఞాన సరస్వతి ఆలయంలో గురువారం 108 హోమ గుండాలతో దంపతులు హోమం పూజలు నిర్వహించారు. వేద పండితులు జగన్నాథం విష్ణువర్ధనాచార్యులు, వారి శిష్యులు సహస్ర దీపాలంకరణ, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​పర్సన్ గుర్రం నీరజ, ఎమ్మెల్యే రవిశంకర్ సతీమణి దీవెన, ఆలయ నిర్వాహకులు జగన్మోహన్​స్వామి, నవ్యకుమార్, శేఖర్, లక్ష్మారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

‘పోడు దరఖాస్తులను పున:పరిశీలించాలి’

కోనరావుపేట, వెలుగు : పోడు భూముల సర్వేలో రిజెక్ట్ చేసిన దరఖాస్తులను పున:పరిశీలించాలని లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బానోతు నరేశ్​నాయక్ డిమాండ్ చేశారు. గురువారం కోనరావుపేట మండల పరిషత్ ఆఫీస్​లో ఐక్యవేదిక నాయకులతో కలిసి ఎంపీడీఓ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ఎంతోమంది గిరిజన రైతులు పోడు భూములు సాగు చేసుకుంటున్నారన్నారు. సుమారు 30 ఏళ్ల నుంచి రైతులు పోడు భూముల హక్కులు కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మోహన్ నాయక్, శ్రీకాంత్ నాయక్, ప్రకాశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

వాహనం ఢీకొని సింగరేణి కార్మికుడు మృతి

రామగిరి(కమాన్ పూర్),వెలుగు: గుర్తుతెలియని వాహనం ఢీకొని మాచర్ల కిరణ్(33) అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని జూలపల్లి గ్రామ పంచాయతీ పరిధి సోలార్ ప్లాంట్ దగ్గర గురువారం బైక్ పై వెళ్తున్న కిరణ్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. కిరణ్​స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాగా అర్జీ -1 పరిధిలోని 11వ గనిలో బుల్లెట్ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తూ పోతన కాలనీలో నివాసం ఉండేవాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

చెత్తను మున్సిపల్​వాహనాల్లో వేయాలి

జమ్మికుంట, వెలుగు : తడి, పొడి, హానికరమైన చెత్తను మున్సిపల్​వాహనాలలో వేయాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య విద్యార్థులకు సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా గురువారం జమ్మికుంట జడ్పీహెచ్ఎస్​బాయ్స్ హై స్కూల్లో పిల్లలకు చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం పిల్లలకు వాతావరణం గురించి వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 

పేద యువతి పెండ్లికి పుస్తె, మెట్టెలు

కోరుట్ల,వెలుగు: స్థానిక లయన్స్ క్లబ్, వాగ్దేవి మహిళా క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని వల్లంపెల్లి గ్రామానికి చెందిన తండ్రిలేని నిరుపేద యువతి వివాహానికి సామగ్రి అందించారు. పసుపు, కుంకుమ, పుస్తె, మెట్టెలు, గాజులు, చీరె, స్టీల్ సామగ్రి, బీరువాను దాతల సాయంతో క్లబ్ ప్రతినిధులు సేకరించి వధువుకు అందించారు. కార్యక్రమంలో సంస్థ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కటుకం రాజేంద్రప్రసాద్, మహిళా క్లబ్ అధ్యక్షురాలు కటుకం కల్యాణి, సెక్రటరీ కైలాస మంజుల, సంధ్య, సురేఖ, దేవిశ్రీ, నీరజ, సురేందర్, నాగేశ్వర్​రావు, ప్రదీప్​పాల్గొన్నారు. 

వాహనం ఢీకొని సింగరేణి కార్మికుడు మృతి

రామగిరి(కమాన్ పూర్),వెలుగు: గుర్తుతెలియని వాహనం ఢీకొని మాచర్ల కిరణ్(33) అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని జూలపల్లి గ్రామ పంచాయతీ పరిధి సోలార్ ప్లాంట్ దగ్గర గురువారం బైక్ పై వెళ్తున్న కిరణ్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. కిరణ్​స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాగా అర్జీ -1 పరిధిలోని 11వ గనిలో బుల్లెట్ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తూ పోతన కాలనీలో నివాసం ఉండేవాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.