బీఆర్​ఎస్​లో కవితకొక న్యాయం.. బహుజనులకొక న్యాయమా...?

బీఆర్​ఎస్​లో కవితకొక న్యాయం.. బహుజనులకొక న్యాయమా...?
  • బిడ్డకో న్యాయం..!,  బహుజనులకొక న్యాయమా..?

భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ఏపార్టీలోనైనా క్యాడర్ మొత్తానికి ఒకే రకమైన నియమ, నిబంధనలను ఏర్పరచుకోవడం అనేది సర్వసాధారణం.  ఉద్యమ ఆకాంక్షల పేరిట,  ప్రాంతీయ నినాదంతో  ఏర్పడిన టీఆర్ఎస్ అనంతరం బీఆర్ఎస్​గా రూపాంతరం చెందింది.  కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా రాజుల కాలంనాటి దమన నీతి కొనసాగుతోంది.  రాజ్యాంగానికి లోబడి పార్టీ నడుచుకోకుండా కేసీఆర్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం అనేది తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపిన విషయం విదితమే. 

తన సొంత బిడ్డ కవిత వ్యవహారంపై  కేసీఆర్ అనుసరించబోయే విధానాలను,  మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు  బీసీలకు, ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని.. కేసీఆర్ సొంత కూతురే అసమ్మతి రాగం వినిపించడం వెనుక ఉన్న రాజకీయ కోణం పలురకాల అనుమానాలకు తావిస్తోంది.  పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి కేసీఆర్  ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తే ఎదురుతిరిగిన ఎంతటి ధీరులనైనా జీరోలుగా ఆయన మార్చి వేశారు.  

కేసీఆర్ అంటే  తెలంగాణ ఉద్యమం,  తెలంగాణ ఉద్యమం అంటే  కేసీఆర్ అన్నట్టుగా ప్రజల్లో ముద్రను వేసుకోవడంలో ఆయన అడుగడుగునా పైచేయి సాధించింది వాస్తవమే.  ఉద్యమ సందర్భంగా ఆలే నరేంద్రతో చేసిన లాబీయింగ్ ఫలించి, కేసీఆర్ నాయకత్వంలోనే తాను నడిచేవిధంగా మార్చుకొని, అటుపిమ్మట విజయశాంతి స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీని కేసీఆర్ టీఆర్ఎస్​లో విలీనం చేసుకున్నారు.  

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందనే సాకుతో 2013లో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆమె రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుని చాలా రోజులు  రాజకీయాలకు దూరంగా ఉన్నారు, దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ ప్రజాపార్టీకి బలమైన బీసీ సామాజిక నేపథ్యం, రాజకీయ అనుభవం ఉన్న కారణంగా తెలివిగా ప్రజారాజ్యం పార్టీలో కలిసేటట్టు కుట్రలు పన్నింది కేసీఆరే అని, అప్పట్లో ఆయన సమకాలికుల గుసగుసలు వినిపించాయి.

కేసీఆర్​ నియంత పోకడ

 రాజకీయంగా గ్రౌండ్ లెవల్ నుంచి ఎదిగిన కాకా వారసత్వంగా వచ్చిన వివేక్​ను, అటు తరువాత కొండా విశ్వేశ్వరరెడ్డిలను కేసీఆర్​దగ్గరకు తీసినట్టే తీసి రాజకీయ అవసరాలు తీరాక పొమ్మనలేక పొగబెట్టాడు. అటు పిమ్మట సొంతపార్టీలో ఉంటూ అసమ్మతి గళాన్ని వినిపించిన దళితుడైన రాజయ్య మంత్రి పదవిని అర్ధంతరంగా ఊడదీస్తే ఎదురుతిరిగే ధైర్యం కూడా చెయ్యలేని దుస్థితి.  తదనంతరం బీసీ బిడ్డ ఈటల రాజేందర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగ చాలా రోజులు మానసికంగా కుమిలి బీజేపీ అండ దొరికాక కాస్త కుదుటపడింది వాస్తవం.  

కోదండరాం పార్టీని అంటీముట్టనట్లు వ్యవహరించిన్నప్పటికీ ఉద్యమంలో ఆయన పాత్ర విస్మరించలేనిది. పార్టీలో ఉంటూ ఆవేశం   లో ఎదురుతిరిగినా సొంతనిర్ణయం తీసుకోలేక ఉడికిపోయినవాళ్లు లెక్కలేనంత ఉండొచ్చు.  గత బీఆర్ఎస్​ పాలనలో  ఒకవైపు తెలంగాణపై అంతులేని ప్రేమ ఉండి కూడా మరోవైపు కేసీఆర్ నియంత పోకడలపై బహిరంగంగా సద్విమర్శ చేసిన రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులను సైతం పక్కకుపెట్టి, ఇబ్బందులకు గురిచేసింది వాస్తవం.  

ఎస్సీ, ఎస్టీ, బీసీ కులసంఘ నాయకులను అంచుకు కూడా రానీయకుండా అణచివేసి, గొర్రెలను, చేపలను పంచుతూ జరిగిన డ్యామేజీని  సరిచేసుకునే క్రమంలో కులసంఘ భవనాలను ఎర చూపారు.  అయితే, నియోజకవర్గ పరిధిలోని పెత్తనమంతా స్థానిక ఎమ్మెల్యే శాసించేవిధంగా నిర్ణయాలు తీసుకోవడం, అగ్రవర్ణాలను మాత్రమే ప్రోత్సహించడం అనేది పార్టీలోని బలహీన వర్గాలకు మింగుడుపడలేదు.

ఆత్మవిమర్శ అవసరం

ఇక కేటీఆర్ అపాయింట్​మెంట్​ కేవలం డబ్బున్న నేతలకు, డల్లాస్ బ్యాచ్​కి మాత్రమే అనే అపవాదు మీడియా వర్గాల్లో  కోడై కూస్తోంది.  సంతోష్ రావుకు  రాజ్యసభ పదవి ఇచ్చేంత అర్హత ఏముందో కూడా అర్థంకాని ధర్మసందేహం పార్టీ కార్యకర్తల్లో ఇప్పటికీ లేకపోలేదు.  ఉద్యమంలో ఉన్న విద్యార్థి నాయకులు పెండ్లి అయ్యి పిల్లలు ఉండి పెద్దవాళ్ళు అయినా కూడా ఇంకా విద్యార్థి సంఘ నాయకులుగా చెలామణీ అవుతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.  

ప్రభుత్వాన్ని  తిట్టిస్తూ సోషల్ మీడియా మేనేజ్​మెంట్​ చేసినంత సులువేమీ కాదు బూత్​స్థాయిలో ఓట్లు వేయించడమనేది.  బీఆర్ఎస్​ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవడం శ్రేయస్కరం. కొసమెరుపు ఏమిటంటే బీఆర్ఎస్ తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఎంత సీరియస్​గా ప్రజల్లోకి తీసుకెళ్తుందో  అంతకు రెట్టించిన స్వరంతో  సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్  చేసిన అవినీతిని బట్టబయలు చేస్తున్నారు.  బీఆర్ఎస్​ హయాంలో అధికార దుర్వినియోగాన్ని  పదేపదే  ప్రతి వేదికపై ప్రస్తావిస్తున్నారు.  

అస్తిత్వం కోసమే బీసీ రాగం

 కేసీఆర్ పార్టీని నడిపించిన విధానం, నాయకత్వ పటిమ, తనకు తానే పోటీ అనుకునే కేసీఆర్​కు  
వారసులమని చెప్పుకునే బిడ్డ కవిత సొంత పార్టీపైనే ధ్వజమెత్తారు.  జాగృతి పేరుమీద నెలజీతాలిచ్చి కృత్రిమ ఆందోళనలు చేస్తుందని పార్టీలో జరిగే చర్చకు బలం చేకూర్చేవిధంగా ఆమె వ్యవహరిస్తున్నారు.  మీడియా చిట్​చాట్​లో ఇంటిగుట్టు రట్టు చేసినట్టు తనపై దుబాయ్ పెయిడ్ బ్యాచ్​తో దుమ్మెత్తి పోస్తున్నారని వాపోతూ  సోషల్ మీడియా సైన్యాన్ని కూడా జీతాలిచ్చి కేటీఆర్ నడిపిస్తున్నారని చెప్పకనే చెప్పేశారు.  


యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుమీద చేసిన కార్యక్రమాలను ముందుండి నడిపించింది వెలమ సామాజిక వర్గాలే అన్న అపవాదు మూటగట్టుకుంది. అంతెందుకు ఆమె  పీఏల్లో మెజార్టీ వెలమ సామాజిక వర్గీయులు కాదా?  కేసీఆర్​ తనయ కవితని దగ్గరగా చూసినవాళ్ళంతా చెప్పే బహిరంగ రహస్యం ఏమిటంటే ఆ ఇంట్లో అత్యంత కులపిచ్చి ఉన్నది ఆమెకే అని! ఎంతగా బీసీ ఉద్యమాన్ని సొంతం చేసుకోవాలని చూసినా బీసీ సమాజం, ముఖ్యంగా బీసీ నాయకులు అంత అమాయకులు ఏమీకాదు.  తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని ఆమె ఎత్తుకున్న కొత్త రాగమనే స్పష్టత వారికి లేకపోలేదు.  

కేసీఆర్​ ఇన్నిరోజులు అధికారం ఎలా చేజిక్కించుకోవాలని ఫామ్ హౌస్​లో అధ్యయనం చేస్తున్నాడని, వ్యూహాలు పన్నుతున్నాడని క్యాడర్ అనుకునేవారు. అయితే, ఈ క్రమంలో ఇంటిపోరు తలపోటుగా మారిందా లేక మంచోచెడో  తెలంగాణ తమ గురించే చర్చించుకోవాలని ఫ్రీ పబ్లిసిటీ స్టంట్లో భాగంగా పన్నిన వ్యూహమా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

కవిత లేఖ పంచాయితీ

ఇప్పుడిక కవిత వంతుగా  లేఖ లీకుల పంచాయితీ ఎటు దారితీస్తుంది అనే చర్చ ఒక వైపైతే,   మరోవైపు లేఖలో రాసిన ఒక్క పదం కూడా తప్పులేదని  దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగితే బాగుంటుందని ద్వితీయశ్రేణి నాయకత్వం కోరుకుంటున్నది.  పార్టీ రాజ్యాంగం కవితకు వర్తింపజేసినట్టు నటిస్తారా?  అందరినీ దూరంపెట్టినట్లు కవితను కూడా దూరం పెట్టగలరా?  లేక బిడ్డను వెనకేసుకొచ్చి పార్టీపరంగా అవలంబించే విధానాల్లో మరింత అప్రతిష్టపాలు అవుతారా?  ఒక్క గొంతుతో ఆగకపోతే పార్టీకి ఎల్కతుర్తి సభతో వచ్చిన కాస్త పాజిటివిటీ కూడా ఆవిరికానుందా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు.  ఇంటిలోన పోరు ఇంతింతగాదయా అన్నట్టు మరోవైపు అల్లుడు హరీశ్​రావుకు సముచిత స్థానం లేదని, పార్టీలోని అసమ్మతులందరికి అల్లుడి ఇల్లు ఆశ్రయంగా మారిందనేది నిజంకాదని నిరూపించుకుంటారా అనేది తెలియాలి.  

కేసీఆర్​ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం అపాయింట్​మెంట్ ఇవ్వలేదనే అపవాదు కూడా ఒక ఓపెన్ సీక్రెట్​గా ఉంది.  ప్రతిపక్షంలో ఉండి స్వయానా ఎమ్మెల్సీగా ఉన్న కన్న కూతురుకి అపాయింట్​మెంట్​ దొరకట్లేదనే విషయం పక్కకు పెడితే,  ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు,  మంత్రులు కలవడానికి ఫామ్​హౌస్​కి వెళ్లి వేచిచూసి వెనుదిరిగినవారు కూడా లేకపోలేదు.

- ముఖేష్ సామల,అడ్వకేట్, పొలిటికల్​ ఎనలిస్ట్​–