పబ్‌జీ బ్యాన్‌తో చైనా కంపెనీకి లక్ష కోట్లు లాస్

పబ్‌జీ బ్యాన్‌తో చైనా కంపెనీకి లక్ష కోట్లు లాస్

టెన్సెంట్‌ మార్కెట్‌ వాల్యూ 14 బిలియన్‌ డాలర్లు తగ్గే చాన్స్‌

ఇప్పటికే రెండు శాతం నష్టపోయిన కంపెనీ షేర్లు

న్యూఢిల్లీ: ఇండియాలో పబ్‌‌జీ గేమ్‌‌ బ్యాన్‌‌తో చైనాలోని అతిపెద్ద గేమింగ్‌‌ కంపెనీ టెన్సెంట్‌‌ భారీగా నష్టపోనుంది. దాని మార్కెట్‌‌ వాల్యూ 14 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.02 లక్షల కోట్లు) పడిపోతుందని మార్కెట్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు. గేమ్​ను ఇండియా బ్యాన్‌‌ చేసిందని తెలియడంతో గురువారం కంపెనీ షేర్లు కూడా 2 శాతం నష్టపోయాయి. అంతకుముందు రెండు సెషన్లలో వచ్చి లాభం తుడిచిపెట్టుకుపోయింది. పబ్‌‌జీకి ఇండియా అతిపెద్ద మార్కెట్‌‌. దాదాపు 17.5 కోట్ల మంది ఈ గేమ్‌‌ను డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్నారు. నిజానికి ఈ గేమ్‌‌ను దక్షిణ కొరియా కంపెనీ డెవెలప్‌‌ చేసింది. మొబైల్‌‌ వెర్షన్‌‌ను మాత్రం టెన్సెంట్‌‌ కొన్నది. మోడీ సర్కారు పబ్‌‌జీ సహా బైదూ, షావోమీ వంటి చైనా కంపెనీలకు చెందిన 118 యాప్స్‌‌ను బుధవారం బ్యాన్‌‌ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ చట్టంలోని 69 ఏ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. కేంద్ర హోం శాఖ సైబర్‌‌ క్రైమ్‌‌ సెంటర్‌‌ కూడా ఇట్లాంటి యాప్స్‌‌ను బ్యాన్‌‌ చేయాలని రికమండ్‌‌ చేసింది. ఇరు దేశాల సరిహద్దులో చైనా సైనికులు మన జవాన్లతో మరోసారి గొడవపడిన నేపథ్యంలో యాప్​ల బ్యాన్​ ప్రకటన వచ్చింది. చైనా సైనికులు ఇండియా భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించగా మన సైనికులు ధీటుగా అడ్డుకున్నారు.

జూన్‌‌లో 59 యాప్‌‌లు

ఈ ఏడాది జూన్‌‌ 29న కేంద్ర ప్రభుత్వం 59 చైనీస్‌‌ యాప్స్‌‌ను బ్యాన్‌‌ చేసింది. ఇందులో టిక్‌‌టాక్‌‌, యూసీ బ్రౌజర్‌‌ లాంటి పాపులర్ మొబైల్‌‌ అప్లికేషన్లున్నాయి. ఆ టైమ్‌‌లో కూడా ఇండియా, చైనా సరిహద్దుల్లో ఘర్షణలు జరిగాయి. రెండు వైపులా ప్రాణనష్టం జరిగింది. దీనిపై సీరియస్‌‌గా రియాక్ట్‌‌ అయిన మోడీ సర్కారు చైనా యాప్స్‌‌తో దేశ భద్రతకు ముప్పు ఉందంటూ బ్యాన్‌‌ చేసింది.

యాప్‌‌ల బ్యాన్‌‌పై చైనా ఆందోళన

యాప్‌‌లను బ్యాన్‌‌పై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియా నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని చైనా కామర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ గావో ఫెంగ్ గురువారం అన్నారు. ‘చైనా ఇన్వెస్టర్లు, సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్ధమైన హక్కులను ఇండియా ఉల్లంఘిస్తోంది. ఇండియా తన తప్పులను సరిదిద్దుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. చైనా కంపెనీలపై వివక్షపూరిత ఆంక్షలు పెట్టి జాతీయ భద్రత అంశాన్ని ఇండియా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.