నిలిచిపోయిన లక్షా 20 వేల నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు

నిలిచిపోయిన లక్షా 20 వేల నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు

నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్​ ఎప్పుడు?

రిజిస్ట్రేషన్లు నిలిచి ఇయాల్టికి 2 నెలలు

రీస్టార్ట్​పై లేని క్లారిటీ
ఇబ్బందిపడుతున్న జనం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను నిలిపివేసి శుక్రవారం నాటికి సరిగ్గా రెండు నెలలయింది. మళ్ళీ రిజిస్ట్రేషన్లను  ఎప్పుడు మొదలుపెడతారనే విషయపై  ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు. గత నెల 29న ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో చిట్ చాట్ చేస్తూ నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ మరో 15 రోజుల్లో మొదలవుతుందని తెలిపారు.  సీనియర్ ఆఫీసర్లు మాత్రం ఇప్పట్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించడం కష్టమే అంటున్నారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఇండ్ల వివరాలను  సేకరించలేదు. ఓపెన్ ప్లాట్స్ వివరాలను అసలే సేకరించలేదు. ఈలోపు ఏ చట్టం ప్రకారం ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. బలవంతంగా ఆస్తుల వివరాలను సేకరించవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సెప్టెంబరు ఆరో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలను నిలిపేశారు. ఆ తర్వాత కొత్త రెవెన్యూ యాక్టు తీసుకొచ్చారు. దీని ప్రకారం  ధరణి వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. ఆ పోర్టల్ లోని ఆస్తుల వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రకటించారు.  ప్రస్తుతం ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను మాత్రమే కొనసాగిస్తున్నారు.

పాత డేటా ప్రకారం రిజిస్ట్రేషన్లు

నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభించినా పాత వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇండ్లు,ఆపార్ట్ మెంట్లలోని ప్లాట్లు, ఓపెన్ ప్లాట్స్ వివరాలను ఇంకా తీసుకోలేదు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న డేటా ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.  రిజిస్ట్రేషన్ శాఖ దగ్గరున్న నాన్ అగ్రికల్చర్ ఆస్తుల వివరాలను ధరణి పోర్టలో అప్​లోడ్ చేసేందుకు  జరుగుతున్న ప్రయత్నాలు పెద్దగా సక్సెస్​ కావడం లేదు. ఇప్పటికే వ్యవసాయ భూముల  వివరాలతో ఏర్పడిన ధరణి పోర్టల్ లో  అనేక టెక్నికల్​ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించిన తర్వాతే నాన్ అగ్రికల్చర్ ఆస్తుల వివరాలను ధరణిలో అప్​లోడ్​ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

నిలిచిపోయిన లక్షా 20 వేల రిజిస్ట్రేషన్లు

రెండు నెలలుగా నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో  దాదాపు 1.20  లక్షల సేల్​ డీడ్ లు నిలిచిపోయినట్టు రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు అంటున్నాయి.‘‘ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు సగటున రెండువేల రిజిస్ట్రేషన్లు జరిగేవి. దసరా ముందు మూడు వేల వరకు ఉండేవి’’అని ఓ సీనియర్ ఆఫీసర్​ తెలిపారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఆస్తులను అమ్మడానికి,కొనడానికి వీలుకావడం లేదు.

ఆగిన 900 కోట్ల ఆదాయం

రెండు నెలల పాటు నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి దాదాపు రూ. 900 కోట్ల ఆదాయం ఆగిపోయిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రతి నెల రూ. 450 కోట్ల ఆదాయం కేవలం రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చేది. ప్రస్తుతం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నా,  వాటివల్ల ప్రభుత్వానికి అందే ఆదాయం తక్కువే! నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లతోనే పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది.‘‘లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ ఆదాయం ఘోరంగా దెబ్బతింది. మెల్లమెల్లగా కోలుకుంటున్న సమయంలో రిజిస్ట్రేషన్లు ఆపేసి ప్రభుత్వం తప్పుచేసింది’’ అని ఓ సీనియర్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు.

For More News..

దుబ్బాకలో బీజేపీదే గెలుపన్న ‘చాణక్య’ సర్వే

మన హైదరాబాద్.. మన బీజేపీ