
అల్లాదుర్గం, వెలుగు: సీతాఫలాల కోసం వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. అల్లాదుర్గం మండలం గొల్ల కుంట తండా పరిధి కోమటికుంట తండాకు చెందిన జైరాం(30) సీతాఫలాల కోసం ఆదివారం మాందాపూర్ అడవిలోకి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి తిరిగి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
సోమవారం అడవిలోకి వెళ్లి వెతుకుతుండగా బావి వద్ద చెప్పులు, ఫోన్, దుస్తులు కనిపించాయి. దీంతో అతను బావిలో పడి ఉండొచ్చని భావించి ఈతగాళ్ల సాయంతో గాలించగా జైరాం డెడ్‌బాడీ లభ్యమైంది. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.