పిల్లల గొడవ పెద్దదై.. ఒకరి మృతి

V6 Velugu Posted on Aug 09, 2020

5 ఇండ్లపై దాడి.. కారు, బైక్ కాల్చేసిన్రు
అర్ధరాత్రి అట్టుడికిన తుఫ్రాన్ పేట్
గ్రామస్థుల ధర్నాతో ఎస్సై సీపీకి అటాచ్

చౌటుప్పల్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట గ్రామం శుక్రవారం రాత్రి రణరంగంలా మారింది. పిల్లల మధ్య చిన్న గొడవ పెద్దదై చివరకు ఒకరిని బలిగొంది. తుఫ్రాన్ పేట గ్రామానికి చెందిన దండుగుల వెంకటేశ్ , దుతంగుల వెంకటేశ్(49) దగ్గరి బంధువులు. దండుగుల వెంకటేశ్ తల్లి ఎల్లమ్మ గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యింది. దుతంగుల వెంకటేశ్ కుటుంబ సభ్యులు ఎన్నికల్లో సహకరించలేదనే కారణంగా ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. పలుసార్లు గొడవ పడ్డారు. శుక్రవారం రాత్రి దుతంగుల వెంకటేశ్ కొడుకు శివ స్నేహితునితో కలిసి బైక్ పై కొత్తగూడెం నుంచి తుఫ్రాన్ పేటకు వస్తున్నాడు. ఇతని వెనకాలే బైక్ పై వచ్చిన దండుగుల వెంకటేశ్ కొడుకు దేవేందర్ వాళ్లను ఓవర్ టేక్ చేసి ఇంటికి వచ్చాడు. దాంతో దేవేందర్ ఇంటి వద్ద శివ బైక్ ను ఆపి గొడవ పడ్డాడు. దేవేందర్ తన తండ్రికి విషయం చెప్పడంతో అతను తన అన్నదమ్ములతో కలిసి శివ ఇంటికి వెళ్లాడు. అక్కడ గొడవ జరిగింది. పోలీసులు వచ్చి అందరినీ చెదరగొట్టి పంపించారు.

తర్వాత శివ కొత్తగూడెంలో ఉన్న తన తండ్రికి విషయం చెప్పాడు. వెంటనే అతను బైక్ పై దండుగుల వెంకటేశ్ ఇంటికి వచ్చాడు. అక్కడే ఉన్న దండుగుల వెంకటేశ్, వర్గీయులు దుతంగుల వెంకటేశ్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. దుతంగుల వెంకటేశ్ వర్గీయులు వచ్చి ఆయనను చౌటుప్పల్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం అదే రాత్రి పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చి ఫిర్యాదు చేయించారు. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతిచెందాడు. విషయం తెలుసుకున్న దండుగుల వెంకటేశ్ కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు ఇండ్లనుంచి పరారయ్యారు. మరణ వార్త
తెలుసుకున్న దుతంగుల వర్గీయులు దండుగుల వెంకటేశ్వర్ వర్గీయుల ఇండ్లపై అదే రాత్రి దాడి చేశారు. ఐదు ఇండ్లపై దాడి చేసి ఓ కారు, బుల్లెట్ కు నిప్పంటించారు. ఇండ్ల అద్దాలు, ఫర్నీచర్, బీరువాలను ధ్వంసం చేశారు. చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఇన్స్పెక్టర్ వెంకన్న అక్కడకు చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది. గ్రామంలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు.

పోలీస్ స్టేషన్ఎదుట ధర్నా
గ్రామంలో జరిగిన గొడవ విషయమై ఎస్సై నాగేశ్వర రావుకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆరోపిస్తూ ఎంపీపీ వెంకట్రెడ్డి, మృతుని కుటుంబసభ్యులు, గ్రామస్థులు శనివారం ఉదయం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఎస్సై గ్రామానికి రాకుండా సిబ్బందిని పంపారని పేర్కొన్నారు. ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని చెప్పినా నిరక్ష్ల్యంగా వ్యవహరించారని చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకోకుండా వారు పరారయ్యేందుకు ఎస్సై సహకరించాడని ఆరోపించారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఏసీపీ సత్తయ్య రాచకొండ సీపీ మహేష్ కు విషయం చెప్పారు. సీపీ వెంటనే ఎస్సైని సీపీ ఆఫీస్ కి అటాచ్ చేయడంతో ధర్నాను విరమించా రు. దుతంగుల వెంకటేశ్ పై దాడి చేసిన దండుగుల వెంకటేశ్, యాదగిరి, దేవేందర్, రమేశ్, వెంకటేశంలపై కేసు నమోదు చేసిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

For More News..

కేంద్ర మంత్రి కైలాశ్‌కు కరోనా

కేరళ విమాన ప్రమాద పైలట్ అమ్మను సర్ ప్రైజ్ చేద్దామనుకున్నడు.. కానీ

రామాలయ భూమి పూజను టీవీల్లో చూసిన 16 కోట్ల మంది

Tagged children, Fight, Choutuppal, Yadadri Bhubanagiri district

Latest Videos

Subscribe Now

More News