
గజ్వేల్, వెలుగు : బ్యాంకులో లోన్లు తీసుకుని చాలాకాలంగా కట్టని రైతుల కోసం వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశాన్ని ఇస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారులు, జిల్లాకె చెందిన ప్రజాప్రతినిధులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. దీని వల్ల జిల్లాలోని 12 వేల మంది రైతులకు మేలు కలుగుతుందన్నారు. జిల్లా బ్యాంకర్లతో మాట్లాడగా.. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ వన్ టైమ్ సెటిల్మెంట్ కల్పించేందుకు ముందుకొచ్చాయన్నారు. పాత, మొండి బకాయిలున్న రైతులు సెటిల్మెంట్ చేసుకోవాలని, దీనివల్ల కొత్తగా లోన్లు తీసుకునే చాన్సు ఉంటుందన్నారు. మొండి బకాయిల లిస్ట్ లను ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఏంపీటీసీలు, ఏంపీపీలు, అధికారులకు త్వరలోనే అందజేయనున్నారు.
ఆయిల్ పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా అనుకూలం..
అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా ఎంతో అనుకూలంగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 10 ఎకరాల కంటే భూ విస్తీర్ణం అధికంగా కలిగిన 3215 మంది రైతులతో పాటు మొత్తం 4 వేల 200 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగుపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలు ఆయిల్ పామ్ తోటలు నాటడం లక్ష్యమన్నారు. ఏఈఓలు పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగు కోసం 100 శాతం రాయితీపై ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా, మండల, గ్రామ నాయకులు, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.