- పర్యవేక్షించిన సీపీ సజ్జనార్
జూబ్లీహిల్స్, వెలుగు: నగర ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కోసం చేపట్టిన హెచ్-సిటీ ప్రాజెక్ట్ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఆదివారం నిర్వహించిన వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ విజయవంతంగా సాగింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రయోగాన్ని అమలు చేశారు.
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రయోగాత్మకంగా వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను రోడ్ నంబర్ 2 వద్ద డైవర్ట్ చేసి, ఇందిరానగర్ – జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, 10 మార్గాల ద్వారా రోడ్ నెంబర్ 45 వైపు మళ్లించారు.
అలాగే రోడ్ నంబర్ 45 నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ ముందు నుంచి రోడ్ నంబర్ 2 వైపు మళ్లించే విధంగా వన్‌వే ఏర్పాటు చేశారు. రోడ్ నంబర్ 10, 12 ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను అగ్రసేన్ మహారాజ్ జంక్షన్–జర్నలిస్ట్ కాలనీ మార్గం ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మళ్లించారు.
ఫలితాల ఆధారంగా మార్పులు: సీపీ
ఈ ట్రయల్ రన్‌ను నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనర్ స్వయంగా పర్యవేక్షించారు. జాయింట్ సీపీ(ట్రాఫిక్) డి. జోయల్ డెవిస్ సహా ఇతర ఉన్నతాధికారులతో కలిసి కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ నుంచి బసవతారకం హాస్పిటల్, అగ్రసేన్ జంక్షన్, ఫిలింనగర్, రోడ్ నంబర్ 45 మార్గంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ప్రధాన కూడళ్లను సందర్శించి వాహనాల రాకపోకలను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలుగా ఈ వన్‌వే విధానాన్ని పరీక్షిస్తున్నామని తెలిపారు. ట్రయల్ ఫలితాల ఆధారంగా శాశ్వత మార్పులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
