దేశంలో 156 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు

దేశంలో 156 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలై ఏడాదైంది. ఈ ఏడాది కాలంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నం. ఇప్పటి వరకు 156.76 కోట్ల టీకాలను వేసి రికార్డు సృష్టించినం. ఈ సందర్భంగా కరోనా టీకాల తయారీలో మన దేశం సాధించిన విజయాలకు గుర్తుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఆదివారం పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ, సైంటిస్టులు, హెల్త్ వర్కర్లు, ప్రజలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు 18 ఏండ్లకు పైబడినోళ్లలో 93 శాతం మందికి ఫస్ట్ డోస్, 69.8 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్రం వెల్లడించింది. కాగా, వ్యాక్సినేషన్ పోయినేడాది జనవరి 16న హెల్త్ కేర్ వర్కర్లకు ఇవ్వడంతో ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు, మార్చి 1 నుంచి 60 ఏండ్లు పైబడినోళ్లకు, ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబడినోళ్లకు, మే 1 నుంచి 18 ఏండ్లు పైబడినోళ్లకు, ఈ నెల 3 నుంచి టీనేజర్లకు (15–18 ఏండ్లు) వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 10 నుంచి ప్రికాషనరీ డోసు కూడా మొదలైంది. 

ఇవీ మైలురాళ్లు...

పోయినేడాది ఏప్రిల్ 1న వ్యాక్సినేషన్ 10 కోట్ల మార్కును చేరుకుంది. జూన్ 25న 25 కోట్లు, ఆగస్టు 6న 50 కోట్లు, సెప్టెంబర్ 13న 75 కోట్లు, అక్టోబర్ 21న 100 కోట్లు, ఈ నెల 7న 150 కోట్ల మార్కును దాటింది. కేవలం 9 నెలల కాలంలోనే 100 కోట్ల డోసుల ఘనతను అందుకున్నం. ఒకే రోజు 2.51 కోట్ల డోసులు వేయడంతో పాటు చాలాసార్లు ఒకేరోజు కోటికి పైగా డోసులు వేసి రికార్డు సాధించాం. ఇక ఇప్పటి వరకు టీనేజర్లకు 3.38 కోట్ల డోసులు, 43.19 లక్షల ప్రికాషనరీ డోసులు పూర్తయ్యాయి. 

కోవాక్స్ లో 100 కోట్ల డోసులు..

‘‘కోవాక్స్’’ ప్రోగ్రామ్ లో భాగంగా 100 కోట్ల డోసులను పేద దేశాలకు పంపిణీ చేసినట్లు డబ్ల్యూహెచ్ వో చెప్పింది. ఇప్పటి వరకు 144 దేశాలకు వ్యాక్సిన్లు ఇచ్చామంది. మొత్తం 194 సభ్య దేశాలు ఉండగా.. వాటిలో 36 దేశాల్లో 10% కంటే తక్కువ, 88 దేశాల్లో 40% కంటే తక్కువ వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపింది.

అందరికీ సెల్యూట్: మోడీ 

కరోనాపై పోరులో వ్యాక్సినేషన్ మనకెంతో బలాన్నిచ్చిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు. ప్రధాని, ప్రజలకు అభినందనలు తెలుపుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.