మూడు నెలల సదువులకు ఏడాది ఫీజు కట్టాల్నట

మూడు నెలల సదువులకు ఏడాది ఫీజు కట్టాల్నట
  • ఇంటికాడున్నా.. హాస్టల్ ఫీజులు కట్టాల్నట
  • పేరెంట్స్ కు కార్పొరేట్ కాలేజీల హుకుం
  • ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు..
  • పట్టించుకోని ఇంటర్మీడియట్ బోర్డు

హైదరాబాద్, వెలుగు: మూడు నెలలే ఫిజికల్ క్లాసులు నడుస్తయి. కానీ ఏడాది మొత్తానికీ కలిపి ఫీజులు కట్టాల్నట. ఇప్పటిదాకా హాస్టళ్లు బంద్ ఉన్నయి. కానీ వీటికి కూడా ఏడాది మొత్తానికీ కలిపి పైసలు కట్టాల్సిందేనట. రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు సాగిస్తున్న ఫీజుల దందా ఇది. కరోనా విపత్తు వల్ల బంద్ అయిన స్కూళ్లు, కాలేజీలు ఈ నెల ఫస్ట్ నుంచి రీస్టార్ట్ అయినయి. ఈ అకడమిక్ ఇయర్ లో మరో మూడు నెలలు మాత్రమే క్లాసులు నడుస్తయి. అయినా ఏడాది ఫీజులు మొత్తం కట్టాల్సిందేనంటూ కాలేజీలు ఒత్తిడి తెస్తుండటంతో స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫోన్లు చేస్తు మరీ పేరెంట్స్ పై ప్రెజర్ పెడుతున్నాయి. కాలేజీల ఫీజుల దోపిడీని అరికట్టాలని ఇంటర్ బోర్డు అధికారులకు కంప్లయింట్ చేసినా పట్టించుకుంటలేరని పేరెంట్స్ వాపోతున్నారు.

సెప్టెంబర్ నుంచే ఆన్‌లైన్

రాష్ర్టంలో మొత్తం1,278 ప్రైవేటు కాలేజీలు ఉండగా.. వాటిలో సుమారు300 వరకు కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ సెకండియర్​ స్టూడెంట్లకు ఆన్​లైన్​ క్లాసులు మొదలయ్యాయి. చాలా కాలేజీల్లో ఆలస్యంగా ప్రారంభం కాగా, కొన్నింటిలో మాత్రం ముందే స్టార్ట్ అయ్యాయి. అధికారికంగా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ అకడమిక్ ఇయర్ కు మొత్తం ఫీజులు  కట్టాల్సిందేనని మేనేజ్మెంట్లు పేరెంట్స్​పై ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేరెంట్స్.. కాలేజీల తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫిజికల్ క్లాసులు మూడు నెలలే

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్​నెలల్లో మాత్రమే ఫిజికల్ క్లాసులు జరగనున్నాయి. మే 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్​ఉంటాయి. సెకండియర్ స్టూడెంట్స్​కు ఏప్రిల్ 7 నుంచి 20  వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. అయితే ఇవేవీ కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లకు పట్టడం లేదు. ఫస్టియర్​అయినా, సెకండియర్ అయినా మొత్తం ఏడాది ఫీజు కట్టాల్సిందేనని పట్టుపడుతున్నాయి. విచిత్రంగా హాస్టల్ లో జాయిన్ అయిన స్టూడెంట్లు.. ఇప్పటి వరకు హాస్టల్ లో లేకున్నా మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. మూణ్నెళ్ల చదువులకు మొత్తం ఫీజు కట్టడం ఏంటని ప్రశ్నిస్తే.. రెంట్, కరెంట్ బిల్లు, ఆన్​లైన్​ క్లాసులంటూ సంబంధం లేని సమాధానాలు చెబుతున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ఫీజులో కొంత మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నా, మేనేజ్మెంట్లు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఫీజుల దోపిడీని అడ్డుకోవాలని కోరుతున్నారు. స్కూల్ హాస్టల్స్, ఇంజనీరింగ్ కాలేజీల హాస్టల్స్​లోనూ ఇదేవిధంగా దోపిడీ కొనసాగుతోందని పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్లు చెబుతున్నాయి.

హాస్టల్ లో లేకున్నా ఫీజు కట్టుమంటున్నరు 

హైదరాబాద్ ఆదిబట్లలోని ఓ కార్పొరేట్ కాలేజీలో నా కొడుకు ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నడు. ఫస్ట్ ఇయర్ లో హాస్టల్​తో కలిపి రూ.1.05 లక్షల ఫీజు కట్టిన. సెకండ్ ఇయర్ లోనూ అంతే ఫీజు అని మొదట చెప్పిన్రు. ఇప్పుడేమో రూ.1.60 లక్షలు కట్టుమంటున్నరు. ఇప్పుడు కాలేజీ నడిచే మూడు నెలలకు అదనంగా హాస్టల్ కోసం ప్రతినెలా రూ.10 వేలు కట్టాలని అడుగుతున్నరు. నా కొడుకు ఇన్నిరోజులు అసలు హాస్టల్ లోనే లేడు. కాలేజీ ఇంకా మూడు నెలలే నడుస్తది. నేనెందుకు మొత్తం ఫీజు కట్టాలని అడిగితే.. మా కాలేజీ రూల్స్ ఇంతేనని చెప్తున్నరు. -శ్రీనివాస్, ఓ ఇంటర్ స్టూడెంట్ తండ్రి

ఇవి కూడా చదవండి..

మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ జైలుకే

ఆర్టీసీని సర్కార్‌‌లో విలీనం చేయాలె

లైన్ దాటి మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడ్త.. వినకపోతే కాళ్లు పట్టుకొని బండకు కొడతా

కేసీఆర్​ వార్నింగ్​ వెనుక మతలబేంది..? ఆరా తీస్తున్న కేడర్