పురుగుల మందు డబ్బాతో తహశీల్దార్ ఆఫీసుకు రైతు

పురుగుల మందు డబ్బాతో తహశీల్దార్ ఆఫీసుకు రైతు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు తీవ్ర నిరసన తెలిపాడు. పాత అంజనాపురం గ్రామానికి చెందిన బత్తుల మధు అనే రైతు తన వారసత్వ భూమికి పట్టా పాస్ బుక్ ఇవ్వలేదని,  పురుగు మందు డబ్బాతో నిరసన ప్రదర్శన చేశాడు.

గత రెండు సంవత్సరాలుగా తన వారసత్వ భూమికి పట్టా పాస్ బుక్ కోసం రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాననీ.. అధికారులు పట్టించుకోవడంలేదని అన్నాడు రైతు మధు. గతంలో డబ్బులు ఇచ్చిన వారికే పాస్ బుక్కులు మంజూరు చేశారని, తాను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల పాస్ బుక్ ఇవ్వలేదని అందుకని గత్యంతరం లేని పరిస్థితుల్లో పురుగు మందు తాగుదామని వచ్చానని చెప్పాడు రైతు.

తెలంగాణ రాష్ట్రంలో, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమైన తమలాంటి వారికి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే మామూలు ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని అన్నాడు రైతు మధు. ఇప్పటికైనా రైతుల పక్షపాతిని  అని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకోవాలని కోరాడు.