పెట్రోకెమికల్స్​ కోసం రూ.లక్ష కోట్ల  ఇన్వెస్ట్​మెంట్

పెట్రోకెమికల్స్​ కోసం రూ.లక్ష కోట్ల  ఇన్వెస్ట్​మెంట్

న్యూఢిల్లీ:  పెట్రోకెమికల్​ తయారీ కెపాసిటీని పెంచడానికి 2030 నాటికి రూ.లక్ష కోట్లు ఇన్వెస్ట్​ చేయాలని కేంద్ర ప్రభుత్వం సంస్థ ఆయిల్​ అండ్​ నేచుల్​ గ్యాస్​ కార్పొరేషన్​ (ఓఎన్​జీసీ) భావిస్తోంది. ఈ డబ్బుతో కొత్త మాన్యుఫాక్చరింగ్​ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. మనదేశాన్ని పెట్రోకెమికల్​ హబ్​గా తీర్చిదిద్దాలన్న కేంద్రం టార్గెట్​ను సాధించడానికే ఈ ప్రయత్నమని ఓఎన్​జీసీ వర్గాలు తెలిపాయి.  మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్​పీఎల్​), దీని జాయింట్ వెంచర్ ఓఎన్​జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఓపాల్​) ద్వారా ప్రాజెక్టులు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఓఎన్​జీసీ అనుబంధ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్​  (హెచ్​పీసీఎల్) పెట్రోకెమికల్ తయారీకి ప్రత్యేకంగా ప్లాన్లను తయారు చేసింది. 2030 నాటికి ఎంఆర్​పీఎల్,  ఓపాల్​ పెట్రోకెమికల్​ తయారీ కెపాసిటీ ఏడాదికి ఎనిమిది మిలియన్​ మెట్రిక్​ టన్నులకు పెరుగుతుందని అంచనా. ఇందుకోసం రెండు మెగా ప్రాజెక్టులను నిర్మిస్తారు. వీటిలో పెట్రోకెమికల్స్​ను తయారు చేయడానికి క్రూడ్​ను లేదా ఫీడ్​స్టాక్స్​ను వాడతారు.

పెట్రోకెమికల్​కు సంబంధించిన ప్లాన్లు తొలిదశలోనే ఉన్నాయని, వీటి గురించి  కంపెనీ బోర్డులో ఇంకా చర్చించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మనదేశంలో 2017-–18, 2021–-22 మధ్య  పెట్రోకెమికల్స్ ఉత్పత్తి ఏటా ఐదుశాతం పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ ఆయిల్, గెయిల్, భారత్ పెట్రోలియం  హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోకెమికల్స్ తయారు చేస్తున్న  కంపెనీలు.